హైదరాబాద్: ఆర్జెంటీనా స్టార్ పుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఓ చిన్న పిల్లాడి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. వరల్డ్ కప్ క్వాలిఫయిర్ మ్యాచ్‌లో భాగంగా అర్జెంటీనా జట్టు ఉరుగ్వేతో తలపడనుంది. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి స్టేడియం లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఆ సమయంలో ఓ పిల్లాడు మెస్సీ ఆటోగ్రాఫ్ కోసం పరుగెత్తుకుంటూ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి నెట్టడం, దాంతో ఆ పిల్లాడు ఏడుపు లంకించుకోవడాన్ని మెస్సీ గమనించాడు. వెంటనే ఆ పిల్లాడిని పిలవమని సెక్యూరిటీని ఆదేశించాడు. అప్పటికే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిన పిల్లాడిని ఓ సెక్యూరిటీ అధికారి తీసుకొచ్చాడు.

వెంటనే ఆ పిల్లాడిని ఎత్తుకుని, ఒక సెల్ఫీ దిగి, ఆటోగ్రాఫ్ ఇచ్చి మెస్సీ పంపించాడు. ఈ క్రమంలో మెస్సీ నుంచి ఊహించని పిలుపు అందుకున్న ఆ పిల్లాడు కన్నీళ్లు ఆగిపోయి ఆనందంగా సెల్ఫీకి పోజిచ్చాడు. పిల్లలంటే ఎంతో ఇష్టపడే మెస్సీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.
గతంలో ఆఫ్రికాకు చెందిన ఓ పిల్లాడికి మెస్సీ తన పేరుతో ఉన్న టీషర్టుని బహుమతిగా ఇచ్చాడు. దక్షిణ అమెరికా పాయింట్ల పట్టికలో అర్జెంటీనా ప్రస్తుతం ఐదో స్దానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు అర్జెంటీనా నేరుగా అర్హత సాధించాలంటే మిగిలున్న మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది.