చరిత్ర సృష్టించిన ఎంబాపే.. సెనెగల్‌పై ఫ్రాన్స్ ఘన విజయం!
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. గ్రూప్-ఐలో భాగంగా బుధవారం తెల్లవారుజామున న్యూజెర్సీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో సెనెగల్‌ను ఓడించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే రెండు గోల్స్‌తో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తద్వారా ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ నమోదు చేసిన ఆటగాడిగా ఎంబాపే సరికొత్త చరిత్రను లిఖించాడు. ఈ క్రమంలో అతను ఓలీవియర్ గిరౌడ్ రికార్డ్‌ను అధిగమించాడు. ఈ గెలుపుతో ఫ్రాన్స్ గ్రూప్-ఐలో అగ్రస్థానంలో నిలిచింది.
ఎంబాపే విశ్వరూపం..
మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు నెమ్మదిగా ఆడినా.. 25వ నిమిషంలో సెనెగల్ ఆటగాడు నికోలస్ జాక్సన్ కొట్టిన షాట్ పోస్ట్‌కు తగిలి వెనుదిరిగింది. హాఫ్-టైమ్‌కు కొద్ది నిమిషాల ముందు సాడియో మానే ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను ఇస్మాయిలా సార్ గోల్‌గా మార్చడంలో విఫలమయ్యాడు. దాంతో ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

సెకండాఫ్‌లో ఫ్రాన్స్ తమ వ్యూహాన్ని మార్చింది. 60వ నిమిషంలో పెనాల్టీ రివ్యూ తిరస్కరణకు గురైనప్పటికీ.. ఫ్రాన్స్ వెనక్కి తగ్గలేదు. కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే (66వ నిమిషం) మైఖేల్ ఒలీస్ అందించిన పాస్‌ను ఎంబాపే అద్భుతమైన గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం 82వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బ్రాడ్లీ బార్కోలా కేవలం 131 సెకన్లలోనే గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
ముగింపులో హై డ్రామా..
మ్యాచ్ ముగిసే సమయానికి సెనెగల్ యువ సంచలనం ఇబ్రహీం ఎంబాయే గోల్ కొట్టి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. 18 ఏళ్ల 143 రోజుల వయసులో ప్రపంచకప్‌లోనే గోల్ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆఫ్రికన్‌గా ఇబ్రహీం ఎంబాయే నిలిచాడు.
అయితే..ఆ సంతోషం సెనెగల్‌కు 68 సెకన్లు కూడా నిలవలేదు. ఎంబాపే లాంగ్ రేంజ్ నుంచి మరో అద్భుతమైన గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు 3-1తో విజయాన్ని ఖాయం చేశాడు.
రికార్డుల వేటలో కిలియన్..
ఈ మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌తో ఎంబాపే అంతర్జాతీయ కెరీర్‌లో 58 గోల్స్ పూర్తి చేసుకుని ఫ్రాన్స్ ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే, జస్ట్ ఫోంటైన్ (13 గోల్స్) రికార్డును బ్రేక్ చేసి, వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ (14) చేసిన ఆటగాడిగా అవతరించాడు. జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ వరల్డ్ కప్ రికార్డు (16 గోల్స్)కు ఎంబప్పే కేవలం రెండు గోల్స్ దూరంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications