ఉత్కంఠ పోరులో ఎంబాపె మ్యాజిక్: పరాగ్వేను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్!
ఫిలడెల్ఫియా స్టేడియం వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కప్ నాకౌట్ పోరులో ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. పరాగ్వే డిఫెన్స్ అడ్డుకున్నప్పటికీ.. కెప్టెన్ కిలియన్ ఎంబాపే సాధించిన అద్భుత పెనాల్టీ గోల్‌తో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ ముగియడానికి మరో 20 నిమిషాలు ఉందనగా.. లభించిన పెనాల్టీని ఎంబాపే చాలా ప్రశాంతంగా గోల్‌గా మలిచి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో జర్మనీకి ముచ్చెమటలు పట్టించిన పరాగ్వే జట్టు.. ఇక్కడ కూడా ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తమ అద్భుతమైన డిఫెన్స్‌తో ఫ్రాన్స్ డిఫెండర్లను ముప్పతిప్పలు పెట్టారు. పరాగ్వే అద్భుతంగా ఆడడంతో మొదటి భాగంలో గోల్స్ ఏవీ నమోదు కాలేదు. ఈ మ్యాచ్ లో డిఫెన్స్ చాలా పటిష్టంగా ఉంది. 1966 తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో తొలి అర్థభాగంలో ఇరు ఇట్లు కనీసం ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టలేకపోవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. ఫ్రాన్స్ ఆటగాడు మను కోనే 54వ నిమిషంలో కొట్టిన బలమైన షాట్ ను పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్ అద్భుతంగా అడ్డుకోవడంతో ఫ్రాన్స్ జట్టుకు మొదటి గోల్ అవకాశం తృటిలో చేజారిపోయింది.

టర్నింగ్ పాయింట్‌గా మారిన పెనాల్టీ
రెండో భాగంలో ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ చేసిన వ్యూహాత్మక మార్పులు ఫ్రాన్స్ జట్టుకు కొత్త ఊపిరి పోశాయి. సబ్‌స్టిట్యూట్‌గా స్టేడియంలోకి వచ్చిన యువ ఆటగాడు డెసిరే డౌను పరాగ్వే డిఫెండర్ డియెగో గోమెజ్ పెనాల్టీ ఏరియాలో కిందపడేయడంతో రెఫరీ ఇల్గిజ్ టాంటాషెవ్ వీడియో అసిస్టెంట్ రిఫరీ రివ్యూ ద్వారా పెనాల్టీ ప్రకటించారు. దీనిపై పరాగ్వే ప్లేయర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ రెఫరీ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. స్టేడియంలో తీవ్ర ఒత్తిడి, ప్రత్యర్థి ఆటగాళ్ల ఆటంకాలు ఉన్నప్పటికీ..కెప్టెన్ కిలియన్ ఎంబాపె ఏమాత్రం తడబడకుండా బంతిని అత్యంత చాకచక్యంగా గోల్ నెట్‌లోకి పంపాడు. ఈ ప్రతిష్టాత్మక గోల్‌తో ఎంబాపే ప్రపంచకప్ నాకౌట్ దశలో అత్యధికంగా 11 గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది అతనికి ఏడో గోల్ కాగా, అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్ విజయంతో ఎంబాపే 19 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో 19 గోల్స్ చేసిన ఘనత సాధించాడు. అలాగే ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్ జట్టుకు ఇది 150వ గోల్ కావడం విశేషం. బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా జట్ల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. అలాగే ఫ్రాన్స్ జట్టు కెప్టెన్‌గా 10వ మ్యాచ్ ఆడిన ఎంబాపే మరో అరుదైన మైలురాయిని దాటాడు. మ్యాచ్ చివరి నిమిషాల్లో పరాగ్వే స్కోరును సమం చేయడానికి విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఫ్రాన్స్ గోల్ కీపర్ మైక్ మైగ్నాన్ అప్రమత్తంగా వ్యవహరించి పరాగ్వే ప్రయత్నాలను అడ్డుకున్నాడు. మరోవైపు పరాగ్వే గోల్ కీపర్ గిల్ కూడా రెండు వరుస అద్భుత సేవ్‌లతో ఎంబాపేను అడ్డుకుని పరాగ్వేకు మరింత నష్టం జరగకుండా కాపాడాడు. అదనంగా ఇచ్చిన పది నిమిషాల స్టాపేజ్ టైమ్‌లో ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్ ఆడినప్పటికీ స్కోరు బోర్డు మారలేదు.
ఈ గెలుపుతో లభించిన ఆత్మవిశ్వాసంతో డిఫెండింగ్ ఛాంపియన్ల జోరు పెరుగుతోంది. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టు బలమైన మొరాకోతో తలపడనుంది. గత ఖతార్ ప్రపంచకప్ సెమీఫైనల్‌లో మొరాకోను 2-0తో ఓడించిన పాత జ్ఞాపకాలు ఫ్రాన్స్ జట్టులో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా క్వార్టర్ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని ఫ్రాన్స్ సన్నద్ధమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications