కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ మూడో సీజన్‌లో ఎట్టకేలకు కేరళ బ్లాస్టర్స్ తొలి విజయాన్ని దక్కించుకుంది. శుక్రవారం ముంబై సిటీ జట్టుతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో 3వ సీజన్‌లో ముంబై ఎఫ్‌సీ జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది.
ఈ సీజన్‌లో ముంబైకి ఇది తొలి ఓటమి. వరుసగా మూడు మ్యాచ్‌లలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ముంబై సిటీ జట్టు నెహ్రూ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ జట్టు ముందు తేలిపోయింది. ఆట ప్రారంభం నుంచే రెండు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారనే ఉత్కంఠ కొనసాగింది.
ఆట కూడా మంచి రసవత్తరంగా సాగింది. ఫస్టాఫ్ మొత్తం హోరాహోరీగా సాగింది. రెండో అర్ధభాగంలో కేరళ విజృంభించింది. ఈ మ్యాచ్‌ని మొత్తం 50,000 మంది ప్రేక్షకులు వీక్షించారు. సొంత స్టేడియంలో మ్యాచ్ జరగడంతో కేరళ బ్లాస్టర్ కు అభిమానల మద్దతు కూడా కలిసొచ్చింది.

ఆట 58వ నిమిషంలో కేరళ స్టార్ ప్లేయర్ బెల్ఫోర్ట్ బలంగా తన్నిన బంతిని అడ్డుకోవడంలో ముంబై డిఫెండర్లు తడబడ్డారు. దీంతో పక్కనే ఉన్న కేరళ ఫార్వర్డ్ ప్లేయర్ మైకేల్ చోప్రా గోల్‌పోస్ట్‌కు రెండు గజాల నుంచి చాలా సునాయాసంగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు.
ఆ తర్వాత అద్భుతమైన అటాకింగ్‌తో కేరళ జట్టు ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న కేరళ జట్టు విజయం సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేరళ ఒక మ్యాచ్ డ్రా చేసుకుని రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ మొదటి స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో ముంబై సిటీ, 5 పాయింట్లతో అట్లెటికో కోల్‌కతా మూడో స్థానంలో ఉండగా, 4 పాయింట్లతో ఢిల్లీ డైనమోస్ నాల్గవ స్ధానంలో కొనసాగుతున్నాయి.