కోచి: డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌తో సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన అట్లెంటికో డీ కోల్‌కతా.. మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని కేరళ బ్లాక్‌బస్టర్స్‌తో బుధవారం కోచిలో తల పడనున్నది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన గంగూలీ సేన.. ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతున్నది.
అలాగని ఇదేం తమకు మితిమీరిన ఆత్మ విశ్వాసం లేదని కోల్‌కతా కోచ్ ఫ్రాన్సిస్కో మొలీనా వ్యాఖ్యానించారు. సత్ఫలితాలు సాధించాలంటే 'పాసింగ్' వద్ద మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంటుందన్నారు.
ఇక ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు నార్త్ ఈస్ట్ చేతిలో ఓటమి పాలైన కేరళ బ్లాక్‌బస్టర్స్ సొంతగడ్డపై తన అదృష్టం పరీక్షించుకునేందుకు జట్టు అస్త్ర శస్త్రాలు తయారుచేసుకుంటున్నది.
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌తో ముందడుగు వేసేందుకు కేరళ బ్లాక్‌బస్టర్స్ కోచ్ స్టీవ్ కోపెల్‌కు అవకాశాలు పుష్కలం. కేరళ రెండో లీగ్‌మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో కోపెల్ మాట్లాడుతూ 'ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్. నేను భారత్‌లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చినప్పటి నుంచి ఆటలో ముందడుగు వేయడం ఎలా? అని నన్ను ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు' అని చెప్పాడు.
తన జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదని ఆయన అంగీకరించారు. తమ వాళ్లు బంతిని తేలిగ్గా వదిలేయడానికి కారణాలు ఏమిటన్నది ఇంకా గుర్తించలేదన్నారు.

'మేం బంతిని వదిలేశాం. ఇదే తొలి మ్యాచ్‌లో సమస్యలు తెచ్చింది. దీనికి తోడు సొంతగడ్డకు దూరంగా ఆడాం. మద్దతుదారుల మధ్య ఆడే మజా వేరు. బంతిని మా నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. అదే మేం బంతిని సరైన దిశలో పంపడానికి ఉపకరిస్తుంది' అని కోపెల్ తెలిపాడు.
గత ఏడాది ప్రేక్షకుల నుంచి భారీస్థాయిలో మద్దతు లభించినా అట్లెంటికో డీ కోల్‌కతాను ఢీ కొట్టేందుకు కేరళ బ్లాక్‌బస్టర్స్ ఆపసోపాలు పడింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో గంగూలీ జట్టు.. 2 - 2 స్కోర్ తేడాతో మ్యాచ్‌ను డ్రా ముగించింది.
ఈ సీజన్‌లో తొలిసారి సొంతగడ్డకు దూరంగా కోల్‌కతా ఆడుతున్నా.. తేడా ఏమీ లేదని ఆ జట్టు కోచ్ మొలీనా మాత్రం మార్పులే ఉండ బోవని ధీమా వ్యక్తంచేశాడు.
'సొంతగడ్డపై ఆడినా, ఇతర ప్రదేశాల్లో ఆడినా ఫుట్‌బాల్ మ్యాచే. ప్లాన్ ఒకటే. మేం మా స్థానాల్లో స్థిరంగా ఉంటూ పోటీకి ప్రయత్నించాలి. డిఫెన్స్ చేసుకుంటూ మ్యాచ్ చివరి వరకూ దూసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మాకు విభిన్నమైన వ్యూహమేదీ రూపొందించుకోలేదు' అని మొలీనా తెలిపాడు. తాము కేవలం 11 మంది కేరళ బ్లాక్‌బస్టర్స్ ప్లేయర్లకు మాత్రమే కాక, బ్లాస్టర్ ప్లేయర్ల ఆటతీరును వీక్షించేందుకు వారికి మద్దతుగా వచ్చే 50 వేల మంది అభిమానులకు వ్యతిరేకంగా ఆడాల్సి ఉంటుందన్నాడు.
'లాస్ట్ సీజన్ ముగిసిన అధ్యాయం. కొత్త సెషన్‌లో కొత్త కోచ్‌లు, కొత్త ప్లేయర్లతో ఆడుతున్నాం. అంతా కొత్తగానే ఉంటుంది. ప్రతి మ్యాచ్ కూడా విభిన్నంగానే ఉంటుంది. గత ఏడాది కోచిలో గెలుపొందాం. ఈ దఫా గెలుపుకోసం ప్రయత్నిస్తాం. గతాన్ని మరిచిపోయి భవిష్యత్‌పైనే దృష్టి సారిస్తాం.' అని మొలీనా వ్యాఖ్యానించాడు.
కెబిఎఫ్‌సితో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు ఉమ్మడిగా ఆడుతుందని తెలిపాడు. పెద్దగా కష్ట పడాల్సిన అవసరమే లేదన్నాడు. ఇరు జట్ల కెప్టెన్లు చాలా ప్రముఖులని కానీ వ్యక్తులపై ఆధారపడి గేమ్ ఆడటం సబబు కాదన్నాడు. డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ ఆఫెంట్సే నాటో ఫిట్‌నెస్ కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించాడు.