
హైదరాబాద్: పుట్‌బాల్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఇలాంటి ఘటనను పుట్‌బాల్ ప్రేమికులు చూసి ఉండరు. ఈఎఫ్ఎల్ కప్ పైనల్లో చోట చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నీలో భాగంగా ఆదివారం చెల్సియా, మాంచెస్టర్ సిటీ జట్ల మధ్య ఆదివారం ఫైనల్లో మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో చెల్సియా గోల్‌కీపర్ కెపా ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైనల్ పోరులో ఇరు జట్ల స్కోరు సమం కావడంతో మ్యాచ్ షూటౌట్ వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు గోల్ కీపర్‌గా ఉన్న కెపా స్థానంలో మరో గోల్‌కీపర్ విల్లీ క్యాబెల్లెరోను సబ్‌స్టిట్యూట్‌గా పంపించాలని ఆ జట్టు కోచ్ భావించారు.
దీంతో కెపాను బయటకు రావాలని కోచ్ మౌరిజియో సర్రి ఆదేశించినా అతడు వినలేదు. అంతేకాదు బయటకు వచ్చే ప్రసక్తే లేదని తన చేతి సైగలతో స్పష్టం చేశాడు. మ్యాచ్ రిఫరీకి తాను మైదానం వీడటానికి ఇష్టంగా లేనని, మ్యాచ్ ఆడేందుకే తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ కోచ్ సర్రికి తెలపడంతో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు.
అంతే గ్యాలరీలో ఉన్న కోచ్ సర్రి చొక్కా చించుకుంటూ పెద్దపెద్దగా కేకలు వేస్తూ మైదానం వీడాడు. అనంతరం కాసేపటికే మళ్లీ తిరిగొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, ఈ మ్యాచ్‌లో చెల్సియా జట్టు షూటౌట్‌లో 3-4 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతం తన ప్రవర్తనపై కెపా ట్విట్టర్‌లో స్పందించాడు. "తనకు కోచ్, జట్టు మేనేజ్‌మెంట్‌పై గౌరవం ఉందని, ఈ ఘటన పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను ఫిట్‌గా ఉన్నా బయటకు రమ్మనడం నచ్చలేదని, తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు" అని ట్వీట్ చేశాడు.