
లండన్: చివరి నిమిషం వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ (యూరో కప్) 2020 తొలి సెమీస్‌లో ఇటలీ ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో స్పెయిన్‌ను ఇటలీ ఓడించింది. మంగళవారం లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన సెమీస్‌లో ఇటలీ ఆటగాడు జోర్గిన్హో నిర్ణయాత్మక పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఆదివారం వెంబ్లీ స్టేడియంలోనే జరిగే యూరో కప్ 2020 ఫైనల్‌లో ఇంగ్లండ్ లేదా డెన్మార్క్‌తో ఇటలీ తలపడనుంది.
తొలి సెమీస్ మ్యాచ్‌లో ఇటలీ, స్పెయిన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ఆసాంతం స్పెయిన్ జట్టే ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. కీలక సమయంలో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక మూల్యం చెల్లించుకుంది. తొలి భాగంలో ఇరు జట్లు గోల్ కోసం ఎంతో ప్రయత్నించాయి. చివరికి 0-0తోనే ముగించాయి. ఇక 60వ నిమిషంలో ఫెడెరికో చియెసా గోల్ కొట్టి ఇటలీని ఆధిక్యంలో తీసుకెళ్లాడు. స్పెయిన్ ఆటగాడు అల్‌వరో మొరాటా 80వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.
అదనపు సమయంలో కూడా ఇటలీ, స్పెయిన్ జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ సమరంలో చెరి ఆరు అవకాశాల్లో ఇటలీ నాలుగు చేయగా, స్పెయిన్ రెండు చేసింది. స్కోర్ 3-2తో ఉన్న సమయంలో ఇటలీ ఆటగాడు జోర్గిన్హో నిర్ణయాత్మక పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంతో ఇటలీ ఘన విజయం సాధించింది. ఇక రెండో సెమీస్ మ్యాచ్ బుధవారం రాత్రి 12.30 గంటలకు ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య జరగనుంది.
మరోవైపు కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో బ్రెజిల్ మరోసారి ఫైనల్ చేరింది. మంగళవారం ఉదయం జరిగిన సెమీస్‌లో బ్రెజిల్ 1-0 తేడాతో పెరూను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ 34వ నిమిషంలో లూకాస్ పక్వెటా కొట్టాడు. గోల్ పోస్టు వద్ద డిఫెండర్ అలెగ్జాండర్ కాలెన్స్ పాస్ చేసిన బంతిని విజయవంతంగా నెట్‌లోకి పంపిన లూకాస్.. బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ కొట్టలేదు. మరో సెమీస్‌లో కొలంబియాను అర్జెంటీనా ఓడించి ఫైనల్ బెర్త్ పట్టేసింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచులో కొలంబియాపై 3-2తో అర్జెంటీనా గెలుపొందింది. మంగళవారం బ్రసిలియాలోని మానే గారించా స్టేడియంలో నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలవడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.