పుణె: ముంబై సిటీ ఎఫ్‌సి చేతిలో పరాజయం పొందిన నార్త్‌ఈస్ట్ యునైటెడ్ జట్టు.. ఎఫ్‌సి పుణె సిటీ జట్టుపై తన ప్రతీకారం తీర్చుకొంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 79వ నిమిషంలో ఉరుగ్వేయన్ స్ట్రైకర్ ఎమిలియానో అల్ఫారో అతి దగ్గర నుంచి గోల్ చేయడంతో పుణెపై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.
36వ నిమిషంలో నిర్మల్‌ఛెత్రిని రెడ్‌కార్డు రూపంలో కోల్పోవాల్సి వచ్చినా జాన్ అబ్రహం జట్టు వెరవలేదు. మెరికల్లా ఆడుతూ అత్యంత స్ఫూర్తి దాయకంగా సమిష్టితత్వం ప్రదర్శిస్తూ మరీ విజయం సాధించారు నార్త్‌ఈస్ట్ కుర్రాళ్లు. తద్వారా పాయింట్ల పట్టికలో తమ జట్టును టాప్‌కు తీసుకెళ్లారు.
ముంబైతో ఓటమి తర్వాత రాబిన్‌సింగ్, రీగన్‌సింగ్, సీత్యాసింగ్‌ల స్థానే నిర్మల్‌ఛెత్రి, శౌవిక్‌ఘోష్, హోలిచరణ్ నార్జారీలతో బరిలోకి దిగిన నార్త్‌ఈస్ట్ జట్టు.. మిడ్‌ఫీల్డ్‌లో చురుగ్గా కదిలే యుసా కస్తుమి, అల్పారో సాయంతో మొదటి నుంచే లీడ్ కోసం ప్రయత్నించింది. కానీ ఎడుయార్డో చేసిన ప్రయత్నం ఫలించలేదు.
మ్యాచ్ ఆతిథ్య జట్టు పుణెకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపించడంతో అనిబల్ రోడ్రిగుజ్‌ను నార్త్‌ఈస్ట్ కుర్రాడు నిర్మల్ ఛెత్రి దాటిగా ఎదుర్కొన్నాడు. మరోవైపు 41వ నిమిషంలో అల్ఫారో హెడ్డర్‌తో చేసిన గోల్‌ను పుణె గోల్‌కీపర్ ఎడెల్‌బెటె తెలివిగా తిప్పికొట్టడంతో తొలి హాఫ్ వరకూ ఏ జట్టు కూడా గోల్ సాధించలేక పోయాయి.

స్వల్ప విరామం తర్వాత బరిలోకి దిగిన ఇరుజట్లు లీడ్‌కోసం చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. నార్త్‌ఈస్ట్ పలు దఫాలు లీడ్ కోసం పలు పొరపాట్లకు పాల్పడింది. రోమరిక్, వెలెజ్, కస్తుమి త్రయం గోల్‌కోసం చేసిన ప్రయత్నాలను పుణె గోల్ కీపర్ బెటె సులువుగానే తిరగొట్టాడు.
నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించినందుకు తమ జట్టు స్పిరిట్ గర్వంగా ఉందని నార్త్‌ఈస్ట్ కోచ్ నెలో వింగాడ వ్యాఖ్యానించాడు. 37వ నిమిషంలో రెడ్‌కార్డుతో నిర్మల్‌ఛెత్రి వైదొలగాల్సి వచ్చినా పది మందితోనే విజయం సాధించినందుకు జట్టు సభ్యులను ప్రశంసల్లో ముంచెత్తాడు.
గ్రేట్ టీం స్పిరిట్‌ను ప్రదర్శించిన తమ కుర్రాళ్లు ఒక అద్భుతమైన ఫ్యామిలీని తలపించారని తెలిపాడు. ప్రస్తుతం చాంపియన్లు కాకపోయినా.. వారు చాంపియన్లుగా గేమ్ ఆడారన్నాడు.
తమ ప్లేయర్ రెడ్‌కార్డుతో వైదొలగడంతో శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న పుణె జట్టుపై విజయానికి చెమటోడ్చాల్సి వచ్చిందని తెలిపాడు. మరో మూడు రోజుల్లో ఢిల్లీ డైనమోస్‌తో తల పడాల్సి ఉన్నదని, కనుక తమ భావోద్వేగాలను కంట్రోల్‌లో పెట్టుకుంటామని అన్నాడు.
గోల్ సాధించిన అల్ఫారో మాత్రం తాము చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు. తాము ప్రతిసారి మ్యాచ్‌లో అవకాశం కనుక్కోవడానికి ప్రయత్నించామని తెలిపాడు. ఫెంటాస్టిక్ ఆట తీరుతోనే గోల్ రూపంలో గిఫ్ట్ పొందామన్నాడు.
పుణె అసిస్టెంట్ కోచ్ మిగౌల్ తమ వైఫల్యాలను అంగీకరించాడు. తమ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగు పడాల్సిన అవసరం ఉన్నదని తెలిపాడు. తమ జట్టు ప్లేయర్ ఎడుయార్డో ఫెరీరాపై రెడ్‌కార్డు వేటుపై స్పందించేందుకు నిరాకరించాడు. రిఫరీ నిర్ణయంపై స్పందించేదేమీ లేదన్నాడు.
అయితే చివరి 20 నిమిషాలు ఆటలో పాల్గొన్న ఫార్వర్డ్ డ్రామనే ట్రావోర్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. జట్టు సారధి మహ్మద్ సిస్సోకో ఆటతీరు మెరుగ్గానే ఉన్నదని అన్నాడు. ఒకవైపు సెంటర్ మిడ్‌ఫీల్డ్‌లోనూ, సెంటర్ బ్యాక్ ప్లేయర్‌గా జంట పాత్రలు పోషించాడని పేర్కొన్నాడు.