కోచి: కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు తమ సారథి అరోన్ హుగెస్ సేవలను కోల్పోనుంది. లీగ్ మలిదశలో మంగళవారం సాయంత్రం ఎఫ్ సి గోవాతో జరిగే ఎంతో కీలకమైన మ్యాచ్‌కు హుగెస్ దూరం కానున్నాడు. ఆయన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లడంతో కేరళ బ్లాక్ బస్టర్స్ ఫ్రాంచైసీకి కష్టకాలం ఎదురు కానుంది. ఇతర జట్ల సారధులతో పోలిస్తే యువ ప్లేయర్ ను సారథిగా ఎంచుకున్నామని కేరళ ఫ్రాంచైసీ చెబుతోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ ల కోసం రావాల్సిందిగా నార్త్రర్న్ ఐర్లాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి.
దీనిపై కేరళ బ్లాక్ బస్టర్స్ చీఫ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ మాట్లాడుతూ 'ఆయనతో సారథిగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు యూరోపియన్ ఛాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొనేందుకు ఆయన వయస్సు దాటిపోయిందని భావించాం. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని ఆలోచించాకే సారధిగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. ఇప్పుడు నార్త్రర్న్ఐర్లాండ్ జట్టులో ప్లేయర్లకు గాయం సమస్య రావడంతో హుగెస్‌కు పిలుపు వచ్చింది' అని తెలిపాడు.
హుగెస్‌తోపాటు హైతేయన్ ఇంటర్నేషనల్ డక్కెన్స్ నాజోన్, బెంగళూర్ ఎఫ్ సి క్లబ్ ప్లేయర్లు రినో అంటో, సికే వినీత్ కూడా కేరళకు అందుబాటులో ఉండరు. హుగెస్ గైర్హాజరీలో మిగతా ప్లేయర్లు ఆయన పాత్ర పోషించడం ద్వారా ఢిల్లీ డైనమోస్‌పై ఇంతకుముందు 0 - 2 స్కోర్ తేడాతో గెలిచినట్లే గోవాతోనూ గెలుస్తారని స్టీవ్ కొప్పెల్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్లకు ఒకచోట అవకాశాలు లభించకపోతే మరొక చోట లభిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవడానికే ప్రతయ్నిస్తారన్నారు.

ఇప్పటి వరకు కేరళ కుర్రాళ్లు హుగెస్, సెడ్రిక్ హంగ్‌బార్ట్‌ల మద్దతుతో మోస్ట్ డిఫెన్సివ్ టీంగా పేరొందారు. కానీ హుగెస్ పరోక్షంలో ఫార్వర్డ్ విభాగంలో దూకుడుగా దూసుకెళ్లే ఎఫ్ సి గోవాను కేరళ కుర్రాళ్లు ఢీ కొనగలరా? అన్నది చూడాల్సిందే. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదు గోల్స్ మాత్రమే చేసిన గోవా జట్టు కోచ్ జికో మాత్రం తన కుర్రాళ్లు స్ట్రయికింగ్ సామర్థ్యం కలిగి ఉన్నారన్నాడు. సెకండ్ ఫేజ్‌లోనైనా మెరుగైన ఫలితాలు సాధించగలమని దీమా వ్యక్తంచేశాడు.
'మా కుర్రాళ్లు యాంగ్జయిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడిని స్కోర్ సాధించి ఫలితం సాధించే దిశగా మళ్లించాలి. మ్యాచ్ ఫినిష్ చేసినప్పుడే ఊరట పొందగలుగుతాం. సహనం లేకపోతే బంతి ముందు నిలబడి కూల్ గా కిక్ కొట్టలేం. ఈ ఏడాది గోల్ కీపింగ్ స్టాండర్డ్ చాలా ఎక్కువగా ఉన్నాయి' అని జికో వ్యాఖ్యానించాడు. కాగా గోవా జట్టులో జులియో సీజర్ గాయంతో బాధపడుతున్నాడు.
ఈ నేపథ్యంలో బ్రెజిలియన్ స్ట్రయికర్ రాఫెల్ కొయెల్హోపైనే గోల్స్ కోసం గోవా జట్టు ఆధార పడాల్సి ఉంటుంది. మాజిస్టిక్ ఫ్రీ కిక్‌లతో ఎఫ్ సి పుణె జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రాఫెల్.. ఇకముందు కూడా అలాగే చెలరేగిపోతే తప్ప.. సెమీస్‌లో అడుగు పెట్టలేదు. ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో గోవా అట్టడుగున ఉన్నది.