ముంబై: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో ఎఫ్ సి గోవా జట్టు బోణీ చేసింది. ముంబైపై శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రిచర్లెయ్సోన్ బార్బోస్ 41వ నిమిషంలో చేసిన గోల్ 1 - 0 స్కోర్ ఆధిక్యాన్నిచ్చింది. దీంతోపాటు చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని పరువు నిలుపుకున్నది.
తద్వారా ఈ ఎడిషన్ లో మోస్ట్ డిఫెన్సివ్ టీంగా పేరొందిన ముంబై సిటీ జట్టునే ముప్పు తిప్పలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో పుణెతో విజయం సాధించి అన్నింటికన్నా ముందుంటుందని భావించిన ఫోర్లాన్ సేన పటుత్వం మరోసారి తేలిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఓటమి, ఒక మ్యాచ్ లో డ్రాతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నా.. మొక్కవోని ధైర్యంతో టాప్‌లో రెండోస్థానంలో ఉన్న ముంబై జట్టుపై విజయం సాధించి గోవా రికార్డు నెలకొల్పింది. గోవా పాజిటివ్ ధోరణితో వ్యవహరిస్తూ ప్రత్యర్థి జట్టుపై అటాకింగ్‌కు దిగింది. లాంగ్ బాల్ ను సైతం మిడ్ ఫీల్డర్ జులియో సీజర్ ద్వారా అడ్డుకున్న గోవా గోల్ కీపర్ అయిబోర్ సమస్యను అధిగమించాడు.
41వ నిమిషంలో బాక్స్ బయట నుంచి పరుగెత్తుకుని వచ్చి మరీ సీజర్ తన వద్దకొచ్చిన బంతిని రిచర్లైయోసొన్ కు పాస్ చేశాడు. దాన్ని రిచర్లోయెసోన్ బంతిని గోల్ పోస్ట్ కు పంపడంతో గోవా ఆధిక్యం సాధించి పాయింట్ల పట్టికలో మూడు పాయింట్లు పొందింది. ఆ వెంటనే మరో గోల్ చేసి రెండో పాయింట్ పొందేందుకు వచ్చిన అవకాశం మిస్సయింది.

సీజర్ తెలివిగా బంతిని అంచనా వేసి మరోసారి రిచర్లైయేసోన్ ద్వారా గోల్ పోస్ట్ కు సమీపంలో ఉన్న రాబిన్ సింగ్ వద్దకు పంపాడు. కాని చౌదరి అడ్డుకోవడంతో కుదరలేదు. సెకండాఫ్‌లో 53వ నిమిషంలో సీజర్ పంపిన ప్రీ కిక్‌ను అడ్డుకునే ముంబై అటాకర్లు ఎవరూ లేకున్నా.. అది వైడ్‌గా మారి గోల్ పోస్ట్‌ను దాటిపోయింది.
గోవా 1 - 0 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించడంతో ముంబైకర్లలో ఒత్తిడి మొదలైంది. ఫోర్లాన్ పదేపదే గోల్ చేసేందుకు పట్టు వదలని విక్రమార్కుడిగా దూసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. గోవా గోల్ చేసిన మరుక్షణం నుంచే స్కోర్ సమం చేయడానికి విఫలయత్నంచేశారు. ఇక సెకండాఫ్‌లో ముంబై జట్టు గోల్స్ చేసే అవకాశం వచ్చినా వదులుకున్నది. అవకాశాలు కల్పించుకోవడంలోనూ విఫలమైంది.
ముంబై సారధి డియాగో ఫోర్లాన్ దూరం నుంచే 43 నిమిషంలో పంపిన బంతిని గోవా గోల్ కీపర్ సుభాషిష్ రాయ్ చౌదరి దిగ్విజయంగా అడ్డుకున్నాడు. ఫస్టాఫ్‌లోనూ ముంబై కుర్రాడు సోనీ నోర్డే గోల్ కోసం చేసిన ప్రయత్నాలను గోవా ప్లేయర్ త్రిండాడే గోంక్లేవ్స్ విజయవంతంగా అడ్డుకున్నాడు.
47వ నిమిషంలోనూ ఫోర్లాన్ రెండోసారి పంపిన బంతి త్రుటిలో తప్పిపోయింది. 53వ నిమిషంలో మాటియాస్ డెఫెడెరికో మ్యాచ్‌ను ప్రభావితంచేసేందుకు ప్రయత్నించినా గోవా డిఫెన్స్ ముందు ఆయన పప్పులు ఉడకలేదు. మరో ముంబై సబ్‌స్ట్యూట్ జాకీచంద్ సింగ్ 63వ నిమిషంలో ఎడమవైపు నుంచి గోల్ పోస్ట్ కు పంపిన బంతిని కీపర్ చౌదరి అడ్డుకున్నాడు.
69వ నిమిషంలో నోర్డే, 86వ నిమిషంలో ఫోర్లాన్ బంతిని గోల్ పోస్ట్ కు పంపేందుకు విఫలయత్నాలు చేశారు. కాకపోతే కొసమెరుపేమిటంటే గోవా మరో గోల్ చేయకుండా ముంబై గోల్ కీపర్ రాబర్టో వొల్పాటో అడ్డుకోవడమే. తాము బాగానే ఆడినా గోవాను అడ్డుకోలేకపోయామని ముంబై గోల్ కీపర్ వొల్పాటే వ్యాఖ్యానించాడు.