ఐఎస్ఎల్: చాంపియన్లకు ఉత్తేజపూరిత స్వాగతం
కోల్‌కతా: ఐఎస్ఎల్ చాంపియన్లు అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) కుర్రాళ్లకు కోల్‌కతా వాసులు, ఫుట్‌బాల్ అభిమానులు, ప్రేమికులు, మద్దతుదారులు సాదర స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి కోచిలో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుపై జరిగిన ఐఎస్ఎల్ 3 టైటిల్ పోరులో ఎటికె విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ట్రోఫీతో కోల్‌కతాకు చేరుకున్న తమ అభిమాన జట్టుకు వేల మంది అభిమానులు సోమవారం సాయంత్రం విమానాశ్రయంలోనూ, బయట ఉత్తేజపూరితమైన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో స్వాగతం పలికి నగరంలోని ఓ షాపింగ్ మాల్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
సుమారు మూడు వేల మందికి పైగా అభిమానులు తమ అభిమాన జట్టు, వారితోపాటు ట్రోఫీని కలిపి తమ స్మార్ట్ ఫోన్లలో బంధించడంలో బిజీబిజీగా గడిపారు. తమకు సాదర స్వాగతం పలికిన అభిమానులకు కోల్ కతా కోచ్ జోస్ మొలీనా ధన్యవాదాలు తెలిపాడు.
తాము ఒక టీంగా ఆడామని, ప్రతి ఒక్కరు ఎటికె కోసం ఉత్తమ సేవలందించడం వల్లే తాను కోచ్‌గా జట్టుకు అద్భుతమైన సేవలందించానని మీడియాకు చెప్పాడు. సారధి హెల్డర్ పొస్టిగ మినహా సౌతాఫ్రికన్ వింగర్ సమీగ్ దౌటీ, బొత్స్వానా డిఫెండర్ అఫెంట్సే నాటో, పోర్చుగల్ సెంటర్ బ్యాక్ ప్లేయర్ సహా విదేశీ ఆటగాళ్లు, అర్నాబ్ మొండాల్ మినహా భారత్ ప్లేయర్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
షూటౌట్‌లో చివరి గోల్ సాధించిన జువెల్ రాజా స్పందిస్తూ 'జిత్ బి కీ ఎటికె' అని వ్యాఖ్యానించాడు. కెనడియన్ స్ట్రయికర్ ఇయాన్ హుమ్ స్పందిస్తూ ప్రస్తుతం తమ షర్టులపై రెండు స్టార్లు ఉన్నాయని చమత్కరించాడు. త్వరలో తయారుచేసే జెర్సీలో టీం లోగోతోపాటు రెండు స్టార్లు ముద్రిస్తాడు.
ఇంటర్నేషనల్ ప్లేయర్లంతా సెలబ్రేషన్ మూడ్‌లో మనిగిపోయారు. ఒకరినొకరు, అభిమానులతోనూ కలిసి సెల్ఫీలు దిగుతూ టీం థీం సాంగ్ 'అమార్ బుకె ఎటికె' అంటూ నేపథ్య గానం చేస్తూ గడిపాడు.

సిటీ క్లబ్‌ల కంటే ఎటికె పాపులారిటీ ఎక్కువ: సంజీవ్ గోయెంకా
కోల్ కతా నగరంలోని ఇతర క్లబ్ ల కంటే అట్లెటికో డి కోల్ కతా క్లబ్ కే ఎక్కువ పాపులారిటీ ఉన్నదని దాని సహ యజమాని సంజీవ్ గోయెంకా వివరణ ఇచ్చాడు. ఎటికె రెండోసారి చాంపియన్ షిప్ గెలుచుకున్న తర్వాత సంప్రదాయంగా లక్షల మంది మద్దతు గల మొహున్ బగన్, ఈస్ట్ బెంగాల్ జట్ల కంటే ఎక్కువ ప్రజాదరణ తమ క్లబ్ కే ఉన్నదని పేర్కొన్నాడు. అంతే కాదు. ఫుట్ బాల్ చరిత్రలో నగరంలోని రెండు క్లబ్ ల వారసత్వాన్ని అంది పుచ్చుకునే దిశగా ముందుకు సాగుతున్నదని చెప్పాడు.

60 వేల మందికి పైగా అభిమానులు
ఐ-లీగ్ టోర్నీకి పాపులారిటీ తగ్గుతున్నా ఎటికెతో జరిగే మ్యాచ్ లకు 60 వేల మందికి పైగా అభిమానులు హాజరవుతున్నారని, రోజురోజుకు హాజరయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోందన్నాడు. ఇతర కోల్ కతా టీం ల కంటే మెరుగైన జట్టు ఉందా? అంటూ వాటికంటే ప్రజాదరణ పొందిన క్లబ్ ఎటికె ఒక్కటేనని, భవిష్యత్ లోనూ అదొక్కటే ఉంటుందని ఉబ్బి తబ్బిబవుతున్నాడు. ఎటికె స్క్వాడ్, సహాయ సిబ్బంది, అభిమానులతో కలిసి సెల్పీలు దిగాడు.

కోల్‌కతాకు ఇది క్రిస్మస్ కానుక
మూడేళ్లలో రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవడం కోల్ కతాకు ఇది క్రిస్మస్ గిఫ్ట్ అని అభివర్ణించాడు. ఈ దఫా టోర్నమెంట్ చాలా పోటాపోటీగా సాగిందని చెప్పాడు. మూడేళ్లలో రెండోసారి టైటిల్ గెలుచుకోవడం ఆశామాషీ కాదన్నాడు. ఐపిఎల్ లో రైజింగ్ పుణె ఫ్రాంచైసీ సహ యజమానిగా కూడా వ్యవహరిస్తున్న సంజీవ్ గోయెంకా.. తనకు రెండు లీగ్ లు, టీంలు సమానమేనన్నాడు. ఐపిఎల్ చాలా ప్రజాదరణ పొందిందని, అయితే ఐఎస్ఎల్ తమకు అంతకంటే ఎక్కువ సక్సెస్ ఇచ్చిందని పేర్కొన్నాడు.

యు-17 ఏర్పాట్లపై సిప్పి హ్యాపీ
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఫిఫా యు - 17 వరల్డ్ కప్ టోర్నమెంట్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై టోర్నీ డైరెక్టర్ జావియర్ సిప్పి సంతోషం వ్యక్తం చేశాడు. ‘వారు చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వేదికల వద్ద పనులు జరుగుతున్నాయి' అని మీడియాతో అన్నాడు. ఐఎస్ఎల్ టోర్నీ కారణంగా ఇటీవల కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించారు. వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారం అందించనున్నది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టోర్నమెంట్ ప్రారంభానికి పది నెలలలోపే ఉండగానే భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు సహకారం అందించేందుకు ముందుకు రావడం ఇదే మొదటిసారన్నాడు. వచ్చే ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి 28 వరకు యు - 17 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ జరుగనున్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications