కోల్ కతా: గతేడాది ఫైనల్స్ రన్నరప్ ఎఫ్ సి గోవా, అట్లెటికో డీ కోల్ కతా (ఎటికె) మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం సాయంత్రం ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా జట్టు 1 - 1తో డ్రాగా ముగించింది. దీంతో ఎఫ్ సి గోవా హ్యాట్రిక్ ఓటమి తర్వాత ఏకైక పాయింట్ సాధించింది.
ఐఎస్ఎల్ సీజన్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్ ల్లో కోల్ కతాతో గోవా ఒక్క దాంట్లోనూ గెలుపొందలేదు. కోల్ కతా ఆటగాడు - సౌతాఫ్రికా వింగర్ సమీగ్ దౌటీ ఆరో నిమిషంలో, గోవా ప్లేయర్ జోఫ్రీ మాతే 77వ నిమిషంలో పెనాల్టీని గోల్ గా మార్చడంతో స్కోర్ 1 - 1గా సమమైంది.
ఐఎస్ఎల్ చరిత్రలోనే రెండు జట్ల మధ్య వరుసగా మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక మ్యాచ్ సెకండాఫ్ లో కోల్ కతాకు చెందిన స్టీఫెన్ పియర్సన్, గోవా ప్లేయర్ సంజయ్ బాల్ముచ్చులకు రిఫరీ, మూడు ఎల్లోకార్డులు, ఒక రెడ్ కార్డు చూపడం గమనార్హం. గోవా పాయింట్ల ఖాతా తెరిచినా దిగువనే నిలువగా, నాలుగు మ్యాచ్ ల్లో 6 పాయింట్లు సాధించిన కోల్ కతా మూడో స్థానానికి చేరుకున్నది.
గోవా హెడ్ కోచ్ జికో భారీగానే మార్పులతో జట్టును రంగంలోకి దించాడు. లక్ష్మీకాంత్ కట్టిమణి, రినాల్డో, ఫుల్గాంకో కోర్డోజో, లుసియో, సహిల్ తావోరాలకు బదులుగా తుది జట్టులో సుభాష్ రాయ్ చౌదరి, కీనాన్ అల్మెడియా, గ్రెగరీ ఆర్నోలిన్, రిచర్లైసన్ బార్బోసా, రాబిన్ సింగ్ లకు చోటు కల్పించాడు.
మరోవైపు కోల్ కతా కూడా మూడు మార్పులు చేసింది. గాయపడిన తిరితోపాటు అభినాష్ రుడియాస్, జువాన్ బెలెంకోసోలకు బదులు కొత్తగా వచ్చిన హెంరికో సెరెనో, బిక్రంసింగ్, స్టీఫెన్ పియర్సన్ లను బరిలోకి దించింది. కోల్ కతా కుర్రాడు సమీగ్ దౌటీ ఆరోనిమిషంలో ప్రీ కిక్ గోల్ పోస్ట్ కు చేరుకోవడంతో ఎటికే ఆధిక్యం సాధించింది.

అంతకుముందు ఇయాన్ హుమ్ పంపిన ఫ్రీ కిక్ బంతిని రాజు గైక్వాడ్ అడ్డుకున్నాడు. దీంతో ఈ బంతి హెడ్డర్ ద్వారా దౌటీకి చేరినా.. సుభాషిష్ రాయ్ చౌదరి అడ్డుకోవడంతో గోల్ అవకాశం మిస్సయింది. మరోసారి రాజు గైక్వాడ్ చేసిన పొరపాటును సావకాశంగా మార్చుకున్న సమీగ్ దౌటీ ఆరో నిమిషంలో బాక్స్ బయట నుంచే బంతిని గోల్ పోస్ట్ దారి మళ్లించడంతో ఫస్ట్ ఆఫ్ లో ఎటికె 1 - 0 తేడాతో ఆధిక్యం సాధించింది.
ఫస్ట్ ఆఫ్ లో కోల్ కతా చిన్న పొరపాట్లతో రెండో గోల్ అవకాశాన్ని మిస్ చేసుకున్నది. ఇక సెకండాఫ్ లో తొలి 15 నిమిషాలు ఇరుజట్లు కూడా 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది. ఎటికె కుర్రాడు స్టీఫెన్ పియర్సన్ కు రిఫరీ మూడుసార్లు ఎల్లో కార్డు చూపడంతో మ్యాచ్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సివచ్చింది.
ప్రబీర్ దాస్ పై ఫౌల్ తో గోవా ప్లేయర్ బాల్ముచ్చుకు రిఫరీ రెండోసారి ఎల్లోకార్డు చూపడంతో వైదొలిగాడు. దీంతో ఇరు జట్ల కోచ్ లు మార్పులు చేశారు. కోల్ కతా కోచ్ మొలినా రుడియాస్ కు బదులు బిక్రంసింగ్ ను రంగంలోకి దించితే.. గోవా మేనేజర్ జికో.. మందార్ రావు దేశాయ్ స్థానే రాబిన్ సింగ్, కీనన్ కు బదులు రోమియో ఫెర్నాండెజ్ కు చోటు కల్పించారు.
77వ నిమిషంలో బాక్స్ లోపల బోర్జా హ్యాండిల్ చేయగా జోఫ్రే పెనాల్టీని గోల్ గా మార్చడంతో స్కోర్ సమమైంది. అయితే ఇరు జట్లూ రెప్పపాటు సమయంలోనే గోల్ చేసే అవకాశాలను కోల్పోయాయి.
రిఫరీ ప్రమాణాలపై జికో ఆగ్రహం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో అమలవుతున్న రిఫరీ ప్రమాణాల తీరుపై గోవా హెడ్ కోచ్ జికో తీవ్రంగా మండిపడ్డాడు. రిఫరీ తీసుకున్న పొరపాటు నిర్ణయాలకు ప్రతి మ్యాచ్ లోనూ తమ జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు.
'నేను భారతీయ ఫుట్ బాల్ ఎదుగుదలకు ఇక్కడకు వచ్చా.. డబ్బు సంపాదన కోసం కాదు. వారికి ఇష్టం లేకుండా లగేజీ సర్దుకుని వెళ్లిపోవడానికి నేను సిద్ధం' అని తెలిపాడీ బ్రెజిలియన్ ప్లేయర్. బాల్ముచ్చుకు రెండో ఎల్లోకార్డు చూపగానే రిఫరీ రెడ్ కార్డు చూపడంపై జికో అభ్యంతరం వ్యక్తంచేశాడు.
కోల్ కతాలో ఒకరిని బయటకు పంపినందుకు ప్రతిగా తమ జట్టు ప్లేయర్ పై రెడ్ కార్డు ప్రయోగించాడన్నాడు. ఇంతకుముందు పుణెతో జరిగిన మ్యాచ్ లోనూ తమ ప్లేయర్ పై రెడ్ కార్డు ప్రయోగించారని, ఇది తమ జట్టును శిక్షించేందుకేనని స్పష్టంచేశాడు. ఐఎస్ఎల్ లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు.
ఐఎస్ఎల్ నిర్వాహకులు ఇప్పటికైనా ఫిఫాలో గుర్తింపు పొందిన రిఫరీలను తీసుకు రావాలని, అప్పుడే ఇండియన్ రిఫరీల ప్రమాణాలు మెరుగవుతాయన్నాడు. జికో మాత్రం దీనిపై తాను ఫిర్యాదు చేయబోవడం లేదని కూడా వివరించాడు. అట్లెటికో డీ కోల్ కతా కోచ్ జోస్ మొలీనా సైతం రిఫరీల నిర్ణయాలు కష్టతరంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం.