
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ ప్లేఆఫ్ దిశగా దూసుకెళుతోంది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ 2-0 తేడాతో గెలుచుకుంది. ఆరంభం నుంచే హైదరాబాద్ ఆధిపత్యం చలాయించింది. ఫ్రాన్ శాండజా (28వ నిమిషంలో) గోల్‌తో హైదరాబాద్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగింది. జోయల్ (83వ నిమిషంలో) గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ పూర్తిగా తేలిపోయింది. ఒక్క గోల్ కూడా కొట్టలేయకపోయింది. మ్యాచ్ ఆసాంతం హైదరాబాద్ ఎఫ్‌సీ ఆకట్టుకుంది. రెండు గోల్స్ బడడమే కాకుండా.. ప్రత్యర్థి కొట్టిన గోల్స్‌ను అడ్డుకుంది. ఇప్పటివరకూ 15 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 7 డ్రాలతో 22 పాయింట్లు దక్కించుకున్నహైదరాబాద్ పట్టికలో మూడో స్థానానికి చేరింది. 15 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 డ్రాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుని చెన్నయిన్ ఆరో స్థానంలో ఉంది.
ఆదివారం రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 3-2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీపై గెలిచింది. గ్యారీ హూపర్ (14వ నిమిషంలో), డిగో కోస్టా (51వ నిమిషంలో), మార్సెలిన్హో (59వ నిమిషంలో), రాయ్ కృష్ణ (65, 87వ నిమిషంలో) గోల్స్ బాదారు. తొలి భాగంలో కేరళ ఆధిపత్యం చెలాయించినా.. రెండో భాగంలో రాయ్ కృష్ణ రెండు గోల్స్ బాదడంతో ఏటీకే విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగే మ్యాచులో ఒడిశాతో జంషెడ్ పూర్ తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో జంషెడ్ పూర్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 14 మ్యాచులలో 9 విజయాలు అందుకుని 30 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 14 మ్యాచులు ఆడిన ఏటికే 8 విజయాలతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ఐదు విజయలతో 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.