గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్లో భాగంగా కేరళబ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ చివరకు ఫలితం తేలకుండానే ముగిసింది. జీఎమ్సీ స్టేడియం వేదికగా గురువారం కేరళబ్లాస్టర్తో జరిగిన మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగిసి నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ ఓటమి నుంచి గట్టెక్కింది. కేరళ బ్లాస్టర్ తరఫున సెర్జియో కిడోంచా(5వ నిమిషం), గ్యారీ హూపర్ (45+1 నిమిషం) గోల్స్ చేయగా.. నార్త్ ఈస్ట్ యునైటెడ్‌లో క్వెసి అప్పియా(51వ నిమిషం), ఇడ్రిస్సా సిల్లా(90వ నిమిషం) గోల్స్ సాధించారు. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఫుట్ బాల్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.
ఇక గుండెపోటుతో తుది శ్వాస విడిచిన ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు ఇరు జట్ల ఆటగాళ్లు ఘన నివాళులర్పించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు డీగో మృతికి సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలోనే కేరళ కెప్టెన్ సెర్జియో కిడోంచా బ్యూటిఫుల్ హెడర్‌తో గోల్ చేసి శుభారంభాన్ని అందించాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన కేరళ.. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. అదే జోరులో గేమ్ 45 +1 వ నిమిషంలో లభించిన పెనాల్టీని గ్యారీ హూపర్ గోల్‌గా మలిచాడు. దాంతో కేరళ బ్లాస్టర్ లీడ్ డబుల్ అయింది. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి 2-0తో భారీ ఆధిక్యాన్ని అందుకుంది.
ఇక సెకండాఫ్‌లో జూలు విధిల్చిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఆటగాళ్లు.. ఆట పున ప్రారంభమైన కొద్దిసేపట్లో గోల్ ఖాతా తెరిచారు. గేమ్ 52వ నిమిషంలో క్వెసి అపై బంతిని గోల్ పోస్ట్‌లోకి కొట్టి కేరళ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. ఇక కేరళ విజయం ఖాయం అనుకుంటున్న తరుణంలో నార్త్ ఈస్ట్ ప్లేయర్ ఇడ్రిస్సా సిల్లా సూపర్ గోల్‌తో స్కోర్లను 2-2గా సమం చేసి జట్టును గట్టెక్కించాడు.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి