
పనాజి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 2020-21 సీజన్‌లో ఎఫ్‌సీ గోవా తిరిగి విజయాల బాట పట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో గోవా 2-1తో గెలుపొందింది. ఈ సీజన్‌లో గోవా ఎఫ్‌సీ మూడో విజయం సాధించింది. 8 మ్యాచులు ఆడిన గోవా.. మూడు విజయాలు అందుకుని 11 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది.
తొలి అర్ధ భాగంలో 33వ నిమిషంలో స్టీఫెన్ ఇజే గోల్‌తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో ఎఫ్‌సీ గోవా గోల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 64వ నిమిషంలో ఇగోర్ అంగ్లో పెనాల్టీని గోల్‌గా మలచడంతో గోవా 1-1తో స్కోరు సమం చేసింది. చివరి క్షణాల్లో మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే ఆఖరి (90) నిమిషంలో ఇగోర్ మరో గోల్ చేయడంతో గోవా మ్యాచ్ దక్కించుకొంది. డ్రా అనుకున్న మ్యాచ్‌ను ఇగోర్ అద్భుత ఆటతో తమ జట్టుకు విజయాన్ని అందించాడు. జంషెడ్‌పూర్ 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
ఐఎస్‌ఎల్ 2020-21 సీజన్‌లో భాగంగా గురువారం, శుక్రవారం మ్యాచులు లేవు. క్రిస్టమస్ పండగ సందర్భంగా రెండు రోజులు మ్యాచులు షెడ్యూల్ చేయలేదు. శనివారం ఈస్ట్ బెంగాల్, చెన్నయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై సిటీ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఏటీకే మోహన్ బగాన్ అదే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెంగళూరు ఎఫ్‌సీ (12), నార్త్ ఈస్ట్ యునైటెడ్ (11), ఎఫ్‌సీ గోవా (11) టాప్-5లో ఉన్నాయి.