
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో గురువారం రాత్రి గోవా ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో 'డ్రా'గా ముగిసింది. తొలి అర్ధభాగంలో గోవా, నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్లు తలో గోల్ చేయగా.. రెండో అర్ధభాగంలో కూడా ఇరు జట్లు చెరో గోల్ బాదడంతో మ్యాచ్ చివరకు 'డ్రా' అయింది.
21వ నిమిషంలో రొమారియో గోల్ బాదడంతో గోవా ఎఫ్‌సీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 41వ నిమిషంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఆటగాడు గాలెగో గోల్ బాది స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో తొలి అర్ధభాగంలో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. ఇక రెండో అర్ధభాగంలో గోవా, నార్త్ ఈస్ట్ యునైటెడ్ పోటీ పడ్డాయి. 80వ నిమిషంలో అమర్జిత్ గోల్ బాది గోవాను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే మరో మూడు నిమిషాలలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ స్కోరును 2-2తో సమం చేసింది. చివరకు మ్యాచ్ డ్రా అయింది.
శుక్రవారం జరిగే మ్యాచులో బెంగళూరు ఎఫ్‌సీతో చెన్నయిన్ ఎఫ్‌సీ తలపడనుంది. మార్గోలోని ఫటోర్డా స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో బెంగళూరు ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. చివరి మ్యాచులో బెంగళూరు విజయం సాధించగా.. చెన్నయిన్ ఓడిపోయింది. బెంగళూరు 18 పాయింట్లతో పట్టికలో ఆరవ స్థానంలో ఉండగా.. చెన్నయిన్ 16 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 15 మ్యాచులలో 10 విజయాలు అందుకుని 33 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 14 మ్యాచులు ఆడిన ఏటికే 8 విజయాలతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా జట్టు ఐదు విజయలతో 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.