
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్‌లో గోవా ఎఫ్‌సీ వరుసగా మూడో మ్యాచును డ్రా చేసుకుంది. గోవాలోని ఫటోర్డా స్టేడియంలో శుక్రవారం రాత్రి ఎస్‌సీ ఈస్ట్ బెంగాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను గోవా 1-1తో డ్రా చేసుకుంది. ఇరు జట్ల తరఫున ఇగోర్ అంగులో, డేనియల్ ఫాక్స్ గోల్స్ చేశారు. గోవా తరఫున 39వ నిమిషంలో అంగులో గోల్ బాదగా.. బెంగాల్ తరఫున 65వ నిమిషంలో ఫాక్స్ గోల్ చేశాడు. చివరి ఐదు మ్యాచులలో గోవాకి ఓటమే లేదు. ఏకంగా నాలుగు డ్రా చేసుకుని.. ఒక మ్యాచ్ గెలిచింది.
తొలి అర్ధ భాగంలో గోవా ఎఫ్‌సీ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈస్ట్ బెంగాల్ కూడా గట్టిపోటీ ఇచ్చింది. గోవా కొట్టిన కొన్ని గోల్స్‌ను బెంగాల్ అడ్డుకుంది. అయితే 39వ నిమిషంలో ఇగోర్ అంగులో గోల్ బాదడంతో గోవా ఖాతా తెరిచింది. దీంతో తొలి అర్ధ భాగంలో ఒక గోల్ మాత్రమే నమోదు అయింది. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లు గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. 65వ నిమిషంలో ఫాక్స్ గోల్ బాది స్కోరును 1-1తో సమం చేశాడు. ఆపై మరో గోల్ నమోదుకాలేదు. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు విఫలమయ్యాయి.
శనివారం జరిగే పోరులో ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్లు తలపడనున్నాయి. జిఎంసి స్టేడియం బాంబోలిమ్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో ముంబై ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. ఆదివారం రెండు మ్యాచులు జరుగుతాయి. ఇక పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, గోవా ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 13 మ్యాచులలో 9 విజయాలు అందుకుని 30 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 13 మ్యాచులు ఆడిన ఏటికే 7 విజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. గోవా ఐదు విజయలతో 21 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.