పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్లో ఎఫ్‌సీ గోవా గోల్స్ మోత మోగించి అద్భుత విజయాన్ని అందుకుంది. గురువారం ఫటోర్డా స్డేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా 3-0తో జంషెడ్ పూర్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో హైదరాబాద్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. గోవా తరఫున జోర్జ్ ఒర్టిజ్(19, 52వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. ఇవాన్ గారిడో(89వ నిమిషం) మరో గోల్ చేశాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే గోవా.. జంషెడ్‌పూర్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 19వ నిమిషంలోనే జోర్జ్ గోల్ కొట్టి గోవా ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఇరు జట్లు ప్రయత్నించినా మరో గోల్ రాలేదు. దాంతో ఫస్టాఫ్ 1-0తో ముగిసింది. సెకండాఫ్‌లో మరింత జోరు పెంచిన గోవా.. 52వ నిమిషంలో మరో గోల్ నమోదు చేసి ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేసుకుంది. సహచర ఆటగాడు అందించిన పాస్‌ను జోర్జ్ అద్భుతంగా గోల్‌గా మలిచాడు.
అనంతరం గోవా మరింత చెలరేగింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పదే పదే దూసుకెళ్లింది. ఆట 89వ నిమిషంలో ఇవాన్ గారిడో మరో గోల్ కొట్టడం గోవా ఆధిక్యం 3-0తో ట్రిపుల్ అయింది. ఇక గోవాను నిలవరించేందుకు జంషేడ్‌పూర్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దాంతో మ్యాచ్ గోవా విజయం లాంఛనమైంది. ఈ రోజు సాయంత్రం ఈస్ట్ బెంగాల్, కేరళ బ్లాస్టర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి