
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గోవాలోని తిలక్ మైదాన్ స్టేడియంలో మంగళవారం రాత్రి ఈస్ట్ బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 2-0 తేడాతో గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచే సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఆధిపత్యం చలాయించింది. మరోవైపు ఈస్ట్ బెంగాల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ 11వ నిమిషంలో క్లెటన్ సిల్వా గోల్‌తో బెంగళూరు ఎఫ్‌సీ ఖాతా తెరిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగింది. తొలి అర్ధభాగం చివరి నిమిషంలో (45వ నిమిషంలో) డెబ్జిట్ మజుందర్ మరో గోల్ బాదడంతో బెంగళూరు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో అర్ధ భాగంలో ఈస్ట్ బెంగాల్‌కు వచ్చిన అవకాశాలు చేజార్చుకుంది. పదేపదే ఆటగాళ్లను మరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈస్ట్ బెంగాల్ మ్యాచ్ మొత్తం ఒక్క గోల్ కూడా నమోదుచేయకపోయింది. బెంగళూరు చివరి ఐదు మ్యాచులలో ఓ విజయాన్ని అందుకుంది.
బుధవారం జరిగే మ్యాచులో ముంబై సిటీ ఎఫ్‌సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ తలపడనుంది. గోవాలోని బాంబోలిమ్‌లోని జిఎంసి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో ముంబై ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. ముంబై పట్టికలో అగ్ర స్థానంలో ఉండగా.. కేరళ 9వ స్థానంలో ఉంది. రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచులో ఓడిపోయాయి.
పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 14 మ్యాచులలో 9 విజయాలు అందుకుని 30 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 14 మ్యాచులు ఆడిన ఏటికే 8 విజయాలతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ఐదు విజయలతో 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.