
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఏటీకే మోహన్‌బగాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఏటీకే 2-0 తేడాతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీని మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి రెండు జట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. అయితే ద్వితీయార్ధంలో ఏటీకే దాడులను పెంచింది. 51వ నిమిషంలో రాయ్ కృష్ణ చేసిన గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికే నార్త్‌ఈస్ట్ ఆటగాడు బెంజమిన్ (58వ నిమిషం) పొరపాటున తమ సొంత గోల్‌పోస్టులోకి బంతిని నెట్టడంతో ఏటీకే ఆధిక్యం రెట్టింపైంది. చివరకు విజయాన్ని అందుకుంది.
ఆదివారం వాస్కోలోని తిలక్ మైదాన్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ 3-1 తేడాతో ఎఫ్‌సీ ఒడిశాపై గెలిచి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 12వ నిమిషంలో ఆంథోనీ పిల్కింగ్టన్ గోల్ చేయడంతో ఈస్ట్ బెంగాల్ ఖాతా తెరిచింది. 39వ నిమిషంలో జాక్వెస్ మాఘోమా మరో గోల్ చేయడంతో బెంగాల్ ఆధిక్యం రెట్టింపైంది. బ్రైట్ ఎనోబాఖారే మరో గోల్ చేసి బెంగాల్ జట్టును 3-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఒడిశా తరఫున మౌరిసియో అదనపు సమయంలో ఒక గోల్ చేశాడు.
నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీపై గెలుపుతో 9 మ్యాచ్‌ల్లో 20 పాయింట్లు సాధించిన ఏటీకే మోహన్‌బగాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఏటీకే చివరి ఐదు మ్యాచులలో మూడు విజయాలు అందుకుంది. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ 11 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ ఆరు పాయింట్లతో 10వ స్థానంలో, ఎఫ్‌సీ ఒడిశా కేవలం రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఈరోజు హైదరాబాద్ ఎఫ్‌సీతో చెన్నయిన్ ఎఫ్‌సీ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.