
వాస్కోడిగామా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2020-21 సీజన్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టుకు తొలి పరాయజం ఎదురైంది. శుక్రవారం రాత్రి వాస్కోడిగామాలో జరిగిన మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0తో గెలిచి నార్త్‌ఈస్ట్ అజేయ జైత్రయాత్రకు బ్రేకులు వేసింది. ఈ మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను జంషెడ్‌పూర్ ఆటగాడు అనికేత్ జాదవ్ 53వ నిమిషంలో బాదాడు. ఇక ఐఎస్‌ఎల్‌లో ఇది 500వ మ్యాచ్ కావడం విశేషం.
తొలి అర్ధభాగంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్, జంషెడ్‌పూర్ జట్లు హోరాహోరీగా తలపడ్డా గోల్ మాత్రం నమోదు కాలేదు. 18వ నిమిషంలో ఖాతా తెరిచేందుకు వచ్చిన అవకాశాన్ని నార్త్‌ఈస్ట్ ప్లేయర్ డ్రిసా సిలా చేజేతులారా చేజార్చుకున్నాడు. ఇక రెండో అర్ధభాగాన్ని దూకుడుగా ప్రారంభించినా నార్త్‌ఈస్ట్‌కు అదృష్టం దక్కలేదు. ఆ తర్వాత జాకీచంద్‌సింగ్ బాల్ పాస్ చేయగా జాదవ్ గోల్ బాదడంతో జంషెడ్‌పూర్ ఆధిక్యం సాధించింది.
మరోవైపు జంషెడ్‌పూర్ గోల్ కీపర్ టీపీ రహ్నేశ్ అద్భుతంగా ఓ పెనాల్టీని అడ్డుకోవడం సహా చివరి వరకు విజయవంతంగా డిఫెండ్ చేసుకోవడంతో జంషెడ్‌పూర్ విజయం సాధించింది. ఈ ఫలితంతో జంషెడ్‌పూర్ పాయింట్ల పట్టికతో ఏడో స్థానానికి చేరగా.. నార్త్ ఈస్ట్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. ఈ రోజు జరిగే మ్యాచులో గోవా ఎఫ్‌సీ, చెన్నయిన్ ఎఫ్‌సీ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7.30 ప్రారంభం కానుంది.