మార్గావ్: చివరి నిమిషం వరకు ఉత్కంఠ. డ్రా గానే ముగుస్తుందా? అన్న సందేహం. రెండు జట్లను వెంటాడింది. కానీ చివరి నిమిషంలో పుణె సిటీ కుర్రాడు మోమర్ నోయే చేసిన గోల్ తొలి విజయాన్ని అందించింది. పుణె, గోవా జట్లు కూడా ఐఎస్‌ఎల్ 3 ఎడిషన్‌లో మూడో విజయం కోసం ఎదురుచూశాయి. చివరకు పుణెదే పై చేయి అయింది.
తొలి హాఫ్‌లో 25వ నిమిషంలో పుణె ఆటగాడు అరాటా ఇజుమి చేసిన గోల్‌కు ప్రతిగా 33వ నిమిషంలో గోవా ఆటగాడు రాఫెల్ కోయెల్హో గోల్ సాధించడంతో రెండు జట్ల స్కోర్ సమమైంది. స్కోర్ సమయం కావడం, రెండు జట్లు చాన్స్ తీసుకుని పట్టు కోసం ప్రయత్నించినా రెండో హాఫ్‌లో చివరి క్షణం వరకూ గోవా ఆధిపత్యం కొనసాగించిందీ కానీ జికో కుర్రాళ్లు ప్రత్యర్థిని గోల్‌చేయకుండా నిలువరించలేకపోయారు.
కానీ పుణె ఆటగాళ్లు మాత్రం చివరి నిమిషంలో నోయే రూపంలో అందివచ్చిన అవకాశాన్ని తమ అదృష్టంగా మార్చుకుని మ్యాచ్‌లో గెలుపొందారు. ప్రస్తుత ఐఎస్‌ఎల్ ఎడిషన్‌లో రెండు జట్లు తొలి మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థి జట్ల చేతిలో ఓటమి పాలవ్వడంతో తొలి విజయం కోసం పోటీ పడ్డాయి. తొలి హాఫ్‌లో పుణె జట్టు పూర్తిగా బంతిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికే మొగ్గు చూపింది.

డిఫెన్సివ్ ఆటతీరుతో గోవా జట్టు గోల్‌చేయాలన్న ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన జొన్నాథన్ లుక్కా పుణెకు డ్రైవింగ్ ఫోర్స్‌గా నిలిచాడు. తద్వారా పలుసార్లు గోవాను సొంత గడ్డపైనే నిలువరించి పాయింట్లు సాధించకుండా అడ్డుకున్నాడు. అరాట ఇజుమీకి ముందు జొన్నాథన్ లుక్కా బంతిని షాట్‌గా మార్చి కిక్ కొడితే గోవా గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి నిరోధించాడు. కానీ ఆ వెంటనే 25వ నిమిషయంలో ఇజుమీ దాన్ని గోల్‌గా మార్చేశాడు.
పుణె కుర్రాళ్లు కిక్ కొట్టిన బంతిని 33వ నిమిషంలో గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ తిరగ్గొట్టడంతో అది నేరుగా వెళ్లి ఎదురు గోల్ బాక్స్ సమీపాన పడింది. దీన్ని సావకాశంగా తీసుకున్న జాఫ్రీ గోంజాలెజ్ గోల్‌గా మార్చి స్కోర్ సమంచేసేశాడు. సెకండాఫ్‌లో కోచ్ జికో ఫుల్గాంకో కార్డోజో స్థానే మిడ్ ఫీల్డర్ రోమియో ఫెర్నాండెజ్‌ను పంపి గోవా మిడ్‌ఫీల్డ్ పటిష్ఠానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. రాఫెల్ కోయెల్హో రూపంలో 54వ నిమిషంలో గోల్‌చేసే అవకాశాన్ని గోవా మిస్సయింది. రాఫెల్ కిక్ కొట్టిన బంతి నేరుగా పుణె కీపర్ ఎడెల్ బెటే చేతిలో పడటంతో గోల్ సాధించలేకపోయారు.
రోమియో ఫెర్నాండెజ్ అతి దగ్గర నుంచి గోల్‌పోస్ట్‌లోకి కిక్ కొట్టడంతో బంతి దూరంగా వెళ్లిపడింది. గోవా సెకండాఫ్‌లో ఆటపై పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ప్రాధాన్యం ఇస్తే, పుణె చివరి నిమిషంలో గోల్ సాధించి విజయం సాధించింది. నోయే నేతృత్వంలోని గోవా డిఫెన్స్‌ను జొన్నాథన్ లుక్కా విడగొట్టి ఎడమ వైపున కార్నర్ మీదుగా బంతిని గోల్ పోస్ట్ దారి మళ్లించడంతో పుణె కుర్రాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
గోవా 17 చాన్స్‌లు మిస్
గోవా కుర్రాళ్లు ఎంత డిఫెన్సివ్‌గా ఆడినా మ్యాచ్‌లో గోల్‌చేసేందుకు ఒకటి కాదు, రెండు కాదు 17 సార్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. గోవా కుర్రాళ్ల ఆటతీరుపై కోచ్ జికో అసంతృప్తివ్యక్తంచేశాడు. కొందరి ఆట మరీ పేలవంగా ఉన్నదన్నాడు. తన శిక్షణనే శిక్షించారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆటగాళ్లు తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా బంతిని కిక్ కొట్టాలని సూచించాడు. తమ కుర్రాళ్లు బాగానే ఆడారు కానీ పాయింట్లు సాధించే అవకాశాలను మిస్ చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు.