ఛెత్రి హ్యాట్రిక్, ఫిఫాకి ముందు భారత జట్టు సూపర్ ఫామ్

హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా 'ఫిఫా' వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... భారత ఫుట్‌బాల్ జట్టు దిగువ స్థాయి టోర్నీలో శుభారంభం చేసింది. నాలుగు దేశాల ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో ఆతిథ్య భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5-0 తేడాతో చైనీస్ తైపీపై ఘనవిజయం సాధించింది. స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ సునీల్ ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్(14ని, 34ని, 62ని)తో విజృంభించగా, ఉదాంత సింగ్(48ని), ప్రణయ్ హల్దర్(78ని) ఒక్కో గోల్ చేశారు.

ఘోరంగా తేలిపోయిన చైనీస్ తైపీ
ముంబై ఫుట్‌బాల్ ఎరీనాలో ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో చైనీస్ తైపీ ఘోరంగా తేలిపోయింది. మ్యాచ్‌లో 67 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న టీమ్‌ఇండియా ప్రత్యర్థికి ఏ దశలోనూ గోల్‌చేసే అవకాశమివ్వలేదు. దీంతో మ్యాచ్‌లో ఎక్కువ శాతం భారత గోల్‌కీపర్ గురుప్రీత్‌సింగ్ ప్రేక్షకునిలా మారాల్సి వచ్చింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన భారత్..లాల్‌ఫెకులా అందించిన పాస్‌ను సునీల్ గోల్‌గా మలిచి బోణీ కొట్టాడు.

అదే దూకుడు కొనసాగించిన భారత్
ఇదే జోరులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై భారత్ పదేపదే దాడులకు దిగింది. ఈ క్రమంలో 34వ నిమిషంలో క్లిష్టమైన పాస్‌ను అందిపుచ్చుకున్న సునీల్ గోల్ చేయడంతో ఆధిక్యం 2-0లోకి వెళ్లింది. ద్వితీయార్థంలో అదే దూకుడు కొనసాగించిన భారత్‌కు 48వ నిమిషంలో ఉదాంత సింగ్ గోల్ అందించాడు. చైనీస్ తైపీ డిఫెన్స్ శ్రేణిని ఏమారుస్తూ ఎడమ కాలుతో కొట్టిన బంతి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.

62వ నిమిషంలో చేసిన గోల్‌తో సునీల్ హ్యాట్రిక్
ఇక తన అద్భుతమైన డ్రిబ్లింగ్ స్కిల్స్‌తో 62వ నిమిషంలో చేసిన గోల్‌తో సునీల్ హ్యాట్రిక్ పూర్తయ్యింది. డీ బాక్స్ చివరి నుంచి ప్రణయ్ హల్దర్ కొట్టిన షాట్‌తో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోగా, ఏ మాత్రం పోటీనివ్వలేకపోయిన చైనీస్ తైపీ చేతులేత్తెసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడం ఛెత్రికి ఇది మూడోసారి. గతంలో అతను 2008లో తజికిస్థాన్‌పై, 2010లో వియత్నాంపై హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు.

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
అతను ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హ్యాట్రిక్ కొట్టడం మరో విశేషం. తర్వాత మ్యాచ్‌లో సోమవారం భారత్.. కెన్యాతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో ఛెత్రి 100వ అంతర్జాతీయ మ్యాచ్ పూర్తి చేసుకోనున్నాడు. నాలుగు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తదుపరి మ్యాచ్‌లో సోమవారం కెన్యాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications