
అహ్మదాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు చివరి స్థానంలో నిలిచింది. మంగళవారం సిరియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగించింది. భారత్ తరఫున యువ ఆటగాడు నరేందర్ గెహ్లోత్ (18) 52వ నిమిషంలో గోల్ కొట్టాడు. ఇక 78వ నిమిషంలో ఫిరాస్ అల్ ఖతిబ్ సాధించిన గోల్‌తో సిరియా స్కోరు 1-1తో సమం అయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. భారత్ గత రెండు మ్యాచ్‌ల్లో 2-3తో తజికిస్థాన్, 2-5తో ఉత్తర కొరియాతో చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్.. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో ఒక పాయింట్ సాధించింది. టోర్నీలో భారత్ ఒకే ఒక్క పాయింట్ సాధించి చివరి స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరియా (4 పాయింట్లు) ఫైనల్‌కు వెళ్లేది. మ్యాచ్ డ్రా కావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన తజికిస్తాన్, ఉత్తర కొరియా జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి.
అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తొమ్మిది గోల్స్ సాధించిన భారత్.. సిరియాపై డిఫెన్స్‌లో కూడా రాణించింది. గహ్లోట్, రాహుల్ భెకే, ప్రీతమ్ కోటల్, మందార్ రావు దేశాయ్‌లు మెరుగైన ఆటతీరును కనబరిచారు. తజికిస్థాన్, ఉత్తర కొరియాతో జరిగిన మ్యాచ్‌లలో ఆకట్టుకున్న అమర్‌జిత్ సింగ్, సహల్ సమద్ కూడా అంచనాలను అందుకున్నారు. కెప్టెన్ సునీల్ ఛెత్రి ఈ టోర్నమెంట్‌లో గోల్ చేయలేదు.