పానాజీ: అది మహారాష్ట్రను ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. ప్రస్తుతం రాష్ట్ర హోదా ఉన్నప్పటికీ చిన్న సముద్ర తీరాన ఉన్న గోవాలో ప్రతిభావంతులకు కొదవలేదు. క్రికెట్, టెన్నిస్, బాల్‌బ్యాడ్మింటన్‌లతోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ఫుట్‌బాల్‌ను కూడా జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పాల్గొంటున్న జట్ల అన్నింటిలోనూ గోవా కుర్రాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారంటే అతిశేయోక్తి కాదు.
అందులో చెప్పుకోదగ్గ ప్రతిభ గల వారు మందార్‌రావు దేశాయి, లెన్నీ రోడ్రిగ్స్, ప్రతీశ్ శిరోద్కర్, కీనన్ ఆల్మేదియా, రోమియో ఫెర్నాండెజ్, బ్రాండన్ ఫెర్నాండేజ్, డెంజిల్ ఫ్రాన్సిస్కో, లక్ష్మీకాంత్ కట్టిమాని,అగస్టిన్ ఫెర్నాండెజ్, రౌలిన్ బోర్గిస్ ఉన్నారు.
ఇతరులకు కొరుకుడు పడని మందార్‌రావు
గోవా జట్టు తరుఫున మందార్‌రావు దేశాయి లెఫ్ట్‌వింగ్ మిడ్ ఫీల్డర్.. ప్రత్యర్థులకు కొరుకుడు పడని వ్యక్తిగా పేరొందాడు. ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలోనూ మంచి ఆటతీరు కనబరిచి అందరి మన్ననలు పొందాడు. గత సీజన్‌లో అప్పుడప్పుడు జట్టు తరఫున ఆడిన ప్రతీశ్ శిరోద్కర్ కూడా మిడ్ ఫీల్డరే. దేశాయ్‌తోపాటు శిరోద్కర్‌కూడా జికో ప్రతిపాదించిన ఆప్షన్లకు అనుగుణంగా ముందుకెళుతూ ఎఫ్‌సి గోవా కోసం మరికొంత సమయం కేటాయించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

రైట్ బ్యాక్‌లో గత ఏడాది అట్లెంటిక్ డీ కోల్‌కతా నుంచి జట్టును రక్షించి స్కోర్‌ను సమం చేసిన ఆల్మేదియా మరోదఫా ఐఎస్‌ఎల్‌లో తన సత్తా చూపనున్నాడు. గోవా ఫ్రాంచైసీకి పోస్టర్ బాయ్‌గా ఉన్న రోమియో ఫెర్నాండెజ్‌ను రైట్ వింగ్‌లో ఉపయోగించుకొనేందుకు జికో ప్రణాళికలు సిద్ధంచేశాడు. ఐఎస్‌ఎల్ ప్రారంభ సీజన్ మ్యాచ్‌లో అట్లెంటికో డీ కోల్‌కతాతో విజయం తర్వాత డెంజిల్ ఫ్రాన్స్‌కో స్థానం ఎఫ్‌సి గోవా జట్టులో స్థిర పడింది. రైట్ ఫుల్ బ్యాక్ క్రీడాకారుడైన ఫ్రాన్స్‌కో వరుసగా మూడోసారి జట్టును విజయ పథాన నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక లక్ష్మీకాంత్ కట్టిమణి జట్టులో రెగ్యులర్ స్టార్టర్‌గా గత ఏడాది నిలిచాడు.
పుణెలో అగస్టీన్, లెన్నీ మెరుపులు
ఎఫ్‌సి పుణె సిటీ జట్టుకు ఎంపికైన ఆగస్టిన్ ఫెర్నాండెజ్.. క్రితం సారి 13 మ్యాచ్‌లు ఆడటంతోపాటు ఒక గోల్ కొట్టాడు. కోల్‌కతా జట్టును ఎదుర్కొన్న అగస్టీన్.. మరో దఫా కోచ్ హబాస్ డైరెక్షన్‌లో మరోదఫా సిద్ధమవుతున్నాడు. లెన్నీ రోడ్రిగ్స్ ఫుణె సిటీకి సీజన్డ్ క్యాంపెయినర్. మిడ్‌ఫీల్డ్ నియంత్రణలో మేటిగా నిలిచాడు. షార్ట్, లాంగ్ పాసెస్ నుంచి డిఫెన్స్‌ను ఎదుర్కొనే సత్తా ఈయన సొంతం.
నార్త్ ఈస్ట్‌లో ఏకైక గోవా కుర్రాడు రౌల్లిన్
నార్త్ ఈస్ట్ యూనెటైడ్ ఎఫ్‌సి తరుఫున ఆడుతున్న రౌల్లిన్ బొర్గెస్ భారత జాతీయ ఫుట్‌బాల్ టీంలోని క్రియేటివ్ మిడ్ ఫీల్డర్లలో ఒకరు. నార్త్ ఈస్ట్ తరుఫున ఆడేందుకు తొలిసారి ఎంపికైన ఈ 24 ఏళ్ల కుర్రాడికి మ్యాచ్ కట్టడి చేయడమెలాగో తెలుసంటే అతిశేయోక్తి కాదు. పాసెస్ ద్వారా స్ట్రైకర్లకు బంతిని పాస్‌చేసే బాధ్యత విజయవంతంగా నిర్వహించగలడు.
గాయాల బారీన బ్రాండన్ ఫెర్నాండెజ్
ముంబై సిటీ ఎఫ్‌సి తరుపున ఆడుతున్న బ్రాండన్ ఫెర్నాండెజ్ నిత్యం గాయాల పాలవుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ మిడ్ ఫీల్డర్లను ఎదుర్కొంటూ జట్టును విజయ తీరాలకు చేర్చే సామర్థ్యం ఆయన సొంతం.