
హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తిరిగి వందలోపు స్థానాన్ని దక్కించుకుంది. తాజాగా గురువారం ఫిఫా ప్రకటించిన ర్యాకింగ్స్‌లో భారత్ 339 పాయింట్లతో లిబియాతో పాటు సంయుక్తంగా 99వ స్థానంలో నిలిచింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా, బ్రెజిల్, పోర్చుగల్, అర్జెంటీనా, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, చిలీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ర్యాంకింగ్స్ కోసం పరిగణనలోకి తీసుకున్న కాలవ్యవధిలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని భారత్ మూడు స్థానాలు ఎగబాకి 99వ స్థానాన్ని అందుకుంది. 1996 తర్వాత గతేడాది అత్యుత్తమంగా 96వ ర్యాంకు సాధించిన భారత్ 105వ స్థానంతో గతేడాదిని ముగించింది. ఆసియా దేశాల్లో భారత్ 13వ స్థానంలో నిలవగా.. ఇరాన్ అగ్రస్థానంలో ఉంది.
గతేడాది మూడుసార్లు వందలోపు ర్యాంకింగ్ సాధించిన భారత జట్టు 1996లో ఫిబ్రవరిలో అత్యున్నతంగా 94వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆసియా దేశాల్లో భారత్ ప్రస్తుతం 13వ స్థానంలో ఉంది. ఆసియా దేశాలైన ఖతార్, ఒమన్, జోర్డాన్, బహ్రెయిన్, నార్త్ కొరియా దేశాలకంటే మెరుగైన ర్యాంకింగ్‌లో ఉంది. ఓవరాల్‌గా ఇరాన్ 33వ ర్యాంక్‌లో, జపాన్ 55 ర్యాంకుల్లో ఉన్నాయి.
ఏఎఫ్‌సీ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ అర్హత మ్యాచ్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో కిర్గిజ్ రిపబ్లిక్‌తో తలపడనుంది. అయితే ఇప్పటికే భారత్ ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించింది.