SAFF U-19 Final: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF U-19) అండర్ 19 మెన్స్ విజేతగా భారత్ అవతరించింది. బంగ్లేదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా 1-1తో రెండు జట్ల స్కోర్ సమం కాగా.. పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో భారత్ గెలుపొందింది.
ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-3 తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి భారత్ కైవసం చేసుకుంది. ఇచ్చిన సమయంలో స్కోర్లు 1-1తో ఉండటంతో మ్యాచ్ పెనాల్టీలకు దారితీసింది. ఆ సమయంలో అభిమానుల్లో ఒంటికాలిపై నిలబడేంత ఉత్కంఠ నెలకొంది.

ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే భారత్ కెప్టెన్ సింగమాయుమ్ షమీ డైరెక్ట్ ఫ్రీ కిక్ కొట్టడంతో భారత జట్టు ఒక గోల్ ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉండగా రెండో అర్థభాగంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఎండీ జాయ్ అహ్మద్ 61వ నిమిషంలో గోల్ సమం చేశాడు. ఈ క్రమంలో పెనాల్టీ షూటౌట్ ద్వారా భారత్ విజయం సాధించింది. 2023 ఎడిషన్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత భారత్ సాధించిన రెండో సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF U-19) అండర్ 19 టైటిల్ ఇది.