ఫిఫా వరల్డ్ కప్: అమెరికాతో భారత్ తొలి పోరు, హాజరుకానున్న మోడీ
హైదరాబాద్: సాకర్ చరిత్రలోనే భారత్ ఓ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మెగా టోర్నీలో భారత్ తొలిసారి అరంగేట్రం చేస్తోంది. ఏ స్థాయిలోనైనా భారత్ తొలిసారి ఓ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తోండటం ఇదే తొలిసారి. అంతేకాదు ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగుతోంది.
అపురూపమైన ఈ ఘట్టాలను తనివితీరా ఆస్వాదించాలనే లక్ష్యంతో ఫిఫా అండర్-17 ప్రపంచకప్ అరంగేట్రానికి భారత యువ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగే గ్రూప్-ఎ ఆరంభ పోరులో భారత్, అమెరికాతో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ విజయావకాశాలు ఎలా ఉన్నా ప్రపంచకప్‌లో పోటీపడటమే భారత్‌కు అతి పెద్ద గౌరవం.
ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా అర్హత సాధించిన భారత్.. ఈ ఈవెంట్ కోసం బాగానే సన్నద్ధమైంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) మన కుర్రాళ్లను.. యూరోప్, మెక్సికో పర్యటనలకు పంపడంతో పాటు వివిధ దేశాల్లో శిక్షణ ఇప్పించింది. దీంతో, భారత్ అండర్ డాగ్‌గా బరిలోకి దిగుతుంది.

మెరికల్లాంటి కుర్రాళ్లను టోర్నీకి ఎంపిక చేసిన కోచ్
మాజీ కోచ్ అడమ్ నికోలాయ్ (జర్మనీ) మెరికల్లాంటి కుర్రాళ్లను ఈ టోర్నీకి ఎంపిక చేశాడు. కానీ, రెండేళ్ల పాటు ఆటగాళ్లను సానబెట్టిన నికోలాయ్‌ని ఈ ఏడాది మార్చిలో రీతిలో తప్పించారు. అతని స్థానంలో మార్చిలో నోర్టాన్ డి మాతోస్ (పోర్చుగల్)ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశారు. ఈ స్వల్ప వ్యవధిలోనే మాతోస్ జట్టులో పలు మార్పులు చేశాడు. దాదాపు ఆరుగురు ప్లేయర్లను కీలక స్థానాల్లోకి తీసుకొచ్చాడు.

మ్యాచ్‌లో అత్యంత కీలకం వీరే
గోల్‌కీపర్‌గా ధీరజ్‌సింగ్‌ను, రెగ్యులర్ సెంటర్ బ్యాక్స్‌గా అన్వర్, జితేందర్‌లకు చోటు ఖాయం. లెఫ్ట్ ఫుల్‌బ్యాక్‌లో సంజీవ్ స్టాలిన్, రైట్ బ్యాక్‌లో హెండ్రీ అంటోనీలను దించనున్నాడు. ఆరడుగుల రెండు అంగుళాల మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్, కెప్టెన్ అమర్‌జీత్, సురేశ్ సింగ్ ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానున్నారు. లెఫ్ట్ ఫ్లాంక్‌లో కోమల్ థాటల్ రాణించడం చాలా అవసరం. ఏకైక స్ట్రయికర్‌గా అనికేత్ జాదవ్‌ను రంగంలోకి దిగనున్నాడు. వీళ్లందరూ సమష్టిగా ఆడితే అమెరికాపై డ్రాతోనైనా గట్టెక్కొచ్చు.

అటాకింగ్ గేమ్ ఆడటంలో అమెరికా దిట్ట
ఇక, అమెరికా జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. అటాకింగ్ గేమ్ ఆడటంలో దిట్ట. భారత్ డిఫెన్స్ దీన్ని నిలువరించగలిగితే గోల్స్ కాకుండా అడ్డుకోవచ్చు. కెప్టెన్, స్ట్రయికర్ జోష్ సార్గెట్... ఈ ఏడాది కొరియాలో జరిగిన అండర్-20 వరల్డ్‌కప్‌లోనూ పాల్గొన్నాడు. ఆ జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లకు మేజర్ సాకర్ లీగ్‌లు, యూరోపియన్ క్లబ్‌ల్లో ఆడిన అనుభవముంది. ప్రొఫెషనల్ అకాడమీల్లో శిక్షణ తీసుకుని ఉన్నారు. గతంలో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన లైబీరియా దిగ్గజం జార్జ్ వీహ్ కుమారుడైన టిమ్ వీహ్ మంచి స్ట్రయికర్. జట్టులో ఏ ఒక్కర్ని తీసుకున్నా ఏదో ఓ దశలో సంచలనాలు సృష్టించినవారే. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారత్‌కు భారీ ఓటమి తప్పదు.

భారత కెప్టెన్ అమర్‌జీత్
ఈ టోర్నీకి మేం రెడీ. బరిలో దిగేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాం. మైదానంలో 110 శాతం పోరాడతాం. మ్యాచ్‌లో మా ప్రణాళిక ఏమిటో కోచ్ నిర్ణయిస్తారు. అమెరికా మంచి జట్టు. అందువల్ల మేం ఏ దశలోనూ ఆత్మ సంతృప్తి పొందాలని అనుకోవడం లేదు. మ్యాచ్ 90 నిమిషాలూ మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సిం దే. మేం ఏ అవకాశాన్నీ వదులుకోబోం. సానుకూల ఫలితం కోసం శాయశక్తూలూ ఒడ్డుతాం.

హాజరు కానున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తోన్న ఈ అండర్-17 వరల్డ్ కప్ టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ మేరకు మ్యాచ్‌కు ముందు చిన్న ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. నిజానికి ఫిఫా టోర్నీల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉండవు. కానీ ఈ టోర్నీకి తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తుండటంతో ప్రధానీ చేతుల మీదుగా చిన్న కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశామని పటేల్ తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications