కోల్‌కతా: క్షేత్రస్థాయిలో ప్రతిభావంతులైన కుర్రాళ్లకు ప్రోత్సాహం అందిస్తూ జాతీయ స్థాయిలో పుట్ బాల్ క్రీడాభివ్రుద్దికి కోచ్‌లు, రిఫరీలు చేస్తున్న క్రుషితోనే ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి)లో భారత క్లబ్ జట్టుకు గుర్తింపు, తర్వాతీ దశలో 2016 వార్షిక అవార్డులు పొందడంలోనూ ఆసియా ఖండంలో అత్యంత వేగంగా ఫుట్ బాల్ ఆట అభివ్రుద్ది చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందని అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఉపాధ్యక్షుడు సుబ్రతా దత్తా పేర్కొన్నాడు.
అత్యున్నతస్థాయిలో మౌలిక వసతుల కల్పిస్తూ, జాతీయ స్థాయి జట్ల ప్రమాణాలను గణనీయ స్థాయిలో పెంపొందించడం ఈ ఆట ప్రేమికులందరికీ ఫుట్ బాల్ పవర్ గా భారత్ ఎదుగుతుందన్న ఆశలు పెంచుకునేందుకు కారణమైందన్నాడు. అయితే తుది పరీక్ష 2017లో ఎదురు కానున్నదని పేర్కొన్నాడు.
యువతను ఉర్రూతలూగించే ఫిఫా యు - 17 వరల్డ్ కప్ టోర్నీ సంరంభం వచ్చే ఏడాది అక్టోబర్ ఆరోతేదీన ప్రారంభమై 28 రోజుల పాటు ఫుట్ బాల్ అభిమానులు, మద్దతుదారులకు ఉత్సాహపూరిత వాతావరణాన్ని తీసుకురానున్నది. టోర్నీ మ్యాచ్ డ్రాలు వచ్చే ఏడాది జూలై ఏడో తేదీన తీస్తారు. టోర్నీ నిర్వహణకు దేశవ్యాప్తంగా ఆరు వేదికలను ఎఐఎఫ్ఎఫ్, ఫిఫా, ఎఎఫ్ సి ఖరారు చేశాయి.
వాటిలో కోల్ కతా, ఢిల్లీ, నేవీ ముంబై, గౌహతి, కోచి, గోవా ఉన్నాయి. '2016లో చేస్తున్న ఏర్పాట్లు 2017లో భారతీయ ఫుట్ బాల్ కు పరీక్ష కానున్నాయి' అని దత్తా మీడియాకు చెప్పాడు. 'ఐ - లీగ్' టోర్నీ నుంచి గోవాకు చెందిన మూడు క్లబ్‌లు వైదొలగడం సరైన విజన్ లేకపోవడమేనన్నాడు. దేశీయంగా ఫుట్ బాల్ ప్రగతిలో గోవా క్లబ్‌ల పాత్రను తీసిపారేయలేమన్నాడు.
ఆయా క్లబ్‌లు వైదొలగడం వల్ల ఐ - లీగ్ నిర్వహణకు ఎదురుదెబ్బే అయినా చెన్నై సిటీ ఎఫ్ సి, మినర్వ పంజాబ్ ఎఫ్ సి వంటి కార్పొరేట్ క్లబ్ ల చేరికతో సమాన పరిస్థితులు ఏర్పడ్డాయన్నాడు. మూడేళ్ల క్రితం ప్రయాణం ప్రారంభించిన బెంగళూరు ఎఫ్ సి జట్టు రెండుసార్లు ఐ - లీగ్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు ఎఎఫ్ సి ఫైనల్స్‌కు దూసుకెళ్లడం సంప్రదాయ విధానంపై ప్రొఫెషనలిజం భారత ఫుట్‌బాల్‌లో సాధించిన విజయమేనన్నాడు.

వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సరర్‌గా ముందుకు రావడం ఆనంద దాయకమని, స్పాన్సర్సిప్ రూపేణా రూ.10 కోట్ల ఆదాయం వస్తుందన్నాడు. తద్వారా భారత జట్టు కూడా మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు వీలు చిక్కతుందన్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు ఎఐఎఫ్ఎఫ్ కార్యవర్గానికి మరో ఐదుగురు స్పాన్సరర్లను తీసుకునేందుకు వెసులుబాటు ఉంది.
లా లీగ కంటే ప్రీమియర్ చాలా కష్టం: చెల్సియా వింగర్ పెడ్రో
స్పానిష్ లా లీగ టోర్నీ కంటే ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఆడటం చాలా కష్ట సాధ్యమని చెల్సియా వింగర్ పెడ్రో వ్యాఖ్యానించాడు. బార్సిలోనా జట్టు తరఫున ఆడి గెలవడం సాధారణమని, కొన్నిసార్లు చాలా తేలిక అని వ్యాఖ్యానించాడు. లా లీగ టోర్నీ టైటిల్ ను బార్సిలోనా ఐదుసార్లు గెలుచుకోవడంలో పెడ్రో కీలక పాత్ర పోషించాడు. కానీ స్పానిష్ లీగ్ కంటే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఆడటం చాలా కష్టంగా ఉందన్నాడు. ప్రీమియర్ లీగ్ తనకు కొత్త కాకపోయినా ఈ లీగ్ చాలా కష్టమైందని, విభిన్నమైందని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ప్రీమియర్ లీగ్ లో వరుసగా 11 విజయాలతో రికార్డు నెలకొల్పిన చెల్సియా జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
బాక్సింగ్ డే నాడు బౌర్నెమౌత్ జట్టుతో జరిగే మ్యాచ్ తోపాటు మూడు మరో విజయాలు సాధిస్తే కోచ్ ఆంటోనియో కాంటే సారథ్యంలో చెల్సియా వరుసగా 14 మ్యాచ్ లు సాధించిన అర్సెనల్ జట్టు రికార్డును సమం చేస్తుంది. వరుసగా 11 విజయాలు సాధించడం కూడా గణనీయమైన విజయమేనని, అందుకే ప్రీమియర్ లీగ్ ఆడటం చాలా కష్టమని పెడ్రో పేర్కొన్నాడు. అయితే బౌర్నెమౌత్ జట్టు చాలా మంచి టీం అని, ఈ జట్టుపై విజయం సాధించాలని నిర్ణయించుకోవడం మంచి లక్ష్యమే అవుతుందన్నాడు. బార్సిలోనా జట్టుకు పలు అవకాశాలు ఉంటాయని, కానీ ఇంగ్లండ్ లో చాలా కష్టమని, సవాళ్లు గొప్పగా ఉంటాయని చెప్పాడు.