నెల్ స్ప్రూట్: చిలీ 48 ఏళ్ళ తర్వాత ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో మ్యాచ్ గెలిచింది. తన ఆరంభ మ్యాచ్ లోనే చిలీ అదరగొట్టింది. తనెంత ప్రమాదరక జట్టునో ప్రత్యర్థులకు తెలిసొచ్చేలా చేసింది. బుధవారం గ్రూప్ 'హెచ్' తొలి పోరులో 1-0తో హొండురస్‌ను అలవోకగా ఓడించింది. బెసెజుర్ 34వ నిమిషంలో చిలీకి గోల్‌ను అందించాడు. గోల్స్ ఆధిక్యం ఆ జట్టు అసలు జోరును ప్రతిఫలించేలా లేదు. హొండురస్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన చిలీ..పూర్తిగా ఎటాకింగ్ గేమ్ ఆడింది. మ్యాచ్ ఆసాంతం ఎడతెరిపి లేకుండా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. చాలా గోల్ ప్రయత్నాలు కొద్దిలో విఫలమయ్యాయి. హొండురస్ గోల్‌కీపర్ వలాడర్స్ పోరాడకుంటే చిలీ గోల్స్ ఆధిక్యం పెరిగేదే! హొండురస్ కూడా కొన్ని అవకాశాలు సృష్టించుకున్నా..సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఆరంభం నుంచే చిలీ దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. మిడ్ ఫీల్డర్ మతియాస్ ఫెర్నాండజ్ ప్రమాదకరంగా కనిపించాడు. రెండో నిమిషంలో అతడి ఫ్రీకిక్ బార్‌కు కొద్దిగా పైనుంచి వెళ్లింది. ఎట్టకేలకు 34వ నిమిషంలో చిలీకి తొలి ఫలితం దక్కింది. ఇస్లా తక్కువ ఎత్తులో ఇచ్చిన పాస్‌ను బెసెజుర్ నెట్లోకి నెట్టాడు. ఆ తర్వాత చిలీ స్త్ట్రెకర్లు మరింత చొచ్చుకుపోయారు. ద్వితీయార్ధంనూ చిలీ అదే జోరును కొనసాగించింది. కానీ ఆధిక్యాన్ని మాత్రం పెంచుకోలేకపోయింది. సువర్ణావకాశాలను వృథా చేసుకుంది. హొండురస్ బాక్స్ నుంచి బంతిని సాంచెజ్ దూరంగా తన్నగా..వాల్డో పోంకే హెడర్‌ను వలాడర్స్ అద్భుతంగా అడ్డుకున్నాడు. వాల్దివా 75వ నిమిషంలో బంతిని నెట్లోకి పంపించాడు. కానీ అది ఆఫ్‌సైడ్. మరోవైపు హండురస్.. చిలీ పటిష్ఠమైన డిఫెన్స్ ఛేదించడానికి తీవ్రంగా శ్రమించింది.