ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్ ను రూ.27 కోట్లకు లఖ్ నవూ సూపర్ జెయింట్స్ దక్కించకుంది. దాదాపు రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ లో, తాను ఆడే మ్యాచ్ లన్నింటికీ కలిపి ఈ జీతాన్ని అందుకుంటాడు పంత్.
మరి నిమిషానికి రూ.21 కోట్లు తీసుకునే ప్లేయర్ ఉన్నాడని మీకు తెలుసా. చదువుతుంటే షాకింగ్ గా ఉంది కదూ. కానీ మీరు చదివింది నిజం. ఓ ప్లేయర్ తాను ఆడినందుకుగానూ, మ్యాచ్ ఫీజు నిమిషానికి అక్షరాల రూ.21 కోట్లు అందుకున్నాడు. మొత్తంగా కేవలం 42 నిమిషాలు ఆడి రూ.895 కోట్లను సంపాదించాడు. అతడు మరెవరో కాదు బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నేమార్.

సౌదీ ప్రో లీగ్ లో భారీ డీల్స్
ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో క్రికెట్ కన్నా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఆటల్లో ఫుట్ బాల్ కూడా ఒకటి. అందుకే ఫుట్ బాల్ ప్లేయర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. లీగుల్లో ఆటగాళ్ల అందుకునే కాంట్రాక్ట్, రెమ్యునరేషన్ కళ్లు చెదిరే రీతిలో ఉంటాయి. ముఖ్యంగా సౌదీ ప్రో లీగ్ లో ప్లేయర్స్ భారీ డీల్స్ అందుతుంటాయి. అందుకే ఈ లీగ్ లో స్టార్ ఫుట్ బాలర్స్ క్రిస్టియానో రొనాల్డో, కరీమ్ బెంజెమా, సాడియో మానే ఇలా చాలామంది ఆడుతుంటారు. అలా 2023లో పారిస్ సెయింట్ జెర్మెయిన్ ను వదిలేసి సౌదీ ప్రో లీగ్ లోని అల్ హిలాల్ జట్టుతో కలిశాడు బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నేమార్. అతడిని ఆ జట్టు ఒక సంవత్సరానికి గానూ ఏకంగా రూ.895.2 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. దీంతో అతడు ప్రపంచంలోనే అత్యధిక జీతాన్ని అందుకున్న టాప్ -3 ప్లేయర్స్ లో ఒకడిగా నిలిచాడు.
ఒక్క టచ్ కు రూ.10 కోట్లు
అయితే ఇక్కడ విషయమేమిటంటే నేమార్ తాను అందుకున్న మొత్తానికి 2024లో కేవలం 42 నిమిషాలు మాత్రమే మ్యాచ్ ఆడాడు. అంటే పిచ్ పై అతడు ఉన్నందుకు నిమిషానికి రూ.21.2 కోట్లు అందుకున్నాడన్న మాట. మరో విషయమేమిటంటే తాను ఆడిన రెండు గేమ్స్ లో 45 సార్లు మాత్రమే బంతిని టచ్ చేశాడు. అంటే ఈ లెక్కన ఒక్క సారి బంతిని టచ్ చేసినందుకు అతడు రూ.10 కోట్లు అందుకున్నాడు. ఇది క్రీడా ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ నెంబర్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచ క్రీడల్లో షాకింగ్ గా మారింది.