పుణె: పెర్పార్మెన్స్ ప్రదర్శనలో విఫలమవుతున్న ఎఫ్ సి పుణె సిటీ క్లబ్ జట్టుకు ప్రధాన కోచ్ ఆంటోనియో హబాస్ రాక బూస్ట్ కానున్నది. నాలుగు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఆదివారం రాత్రి ఏడు గంటలకు పుణెలోని శ్రీ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌తో జరిగే మ్యాచ్‌లో పుణె కు ర్రాళ్లకు హబాస్ గైడెన్స్ లభించనున్నది.
గత రెండు ఎడిషన్లలో సొంత గడ్డపై శుభారంభాన్నందుకుని ముందుకు సాగేది పుణె సిటీ. తొలి ఎడిషన్‌లో మూడు మ్యాచ్‌ల్లో రెండింట విజయం సాధించి.. 2015లోనూ అదే వారసత్వాన్ని కొనసాగించింది. కానీ ఈ దఫా వెనుక పట్టు నుంచి ముందడుగు వేయలేక సతమతమవుతున్నది. గత ఏడాది చివరిగా అట్లెటికో డీ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌కు హబాస్ అందుబాటులో ఉన్నాడు.

ఈ ఏడాది టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లోనూ కేవలం ఒక్క పాయింట్ తోనే సరిపెట్టుకున్న నేపథ్యంలో హెడ్ కోచ్ హబాస్ సేవలు తప్పనిసరిగా మారాయి. ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్ చివరిక్షణంలో లక్కీగా చేసిన గోల్ వల్లే తొలి విజయం నమోదైంది.
అసిస్టెంట్ కోచ్ మిగౌల్ మాట్లాడుతూ 'మేం ఆటతీరు మెరుగుపరుచుకునే దారిలో ఉన్నాం. మేం కనీసం ఒక్కటి కూడా వదులుకోదలుచుకోలేదు. కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రా చేసుకున్నాం. మేం బాగానే ఆడాం. గెలుచుకోవాల్సిన మ్యాచ్. తదుపరి మ్యాచ్‌లో కష్టపడి జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తాం' అని అన్నాడు. నాలుగు మ్యాచ్‌ల నిషేధం తర్వాత రంగ ప్రవేశంచేస్తున్న హబాస్‌కు నిర్వహణ బాధ్యతలను మిగౌల్ అప్పగించనున్నాడు.
అయితే డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్‌పై విజయం సాధించడం పుణెకు అంత తేలికేం కాదు. ఇంతకుముందు కూడా పుణె సిటీ జట్టుపై చెన్నైయిన్ ఓటమి పాలైన రికార్డు నమోదు కాలేదు. మూడు మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
దారుణంగా దెబ్బతిని ఉన్న పుణెకు దాని ప్రత్యర్థి చెన్నైయిన్ చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎఫ్ సి గోవా, నార్త్ఈస్ట్ యునెటైడ్ జట్లపై జరిగిన మ్యాచ్‌ల్లో విజయంతో జోరుమీదున్నది. ఒకవేళ పుణెపై కూడా చెన్నైయిన్ విజయం సాధిస్తే ప్రస్తుత ఐఎస్ఎల్ ఎడిషన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుచుకున్నరికార్డు నెలకొల్పినట్లవుతుంది.
'గెలుపొటములు జట్ల మానసిక పరిస్థితిపై విభిన్న ప్రభావం చూపుతాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మేం ఓటమి పాలైన తర్వాత సమీక్షించుకున్నాం. మా ఆట తీరు చాలా చండాలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత సత్ఫలితం సాధించేందుకు గాను మా ఆటతీరు, వైఖరి మార్చుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది' అని చెన్నైయిన్ ఎఫ్ సి కోచ్ మార్కో మాట్టరాజీ వ్యాఖ్యానించాడు.
గాయాల కారణంగా కోలుకోని వారి స్థానే కొత్త ప్లేయర్లకు చోటు కల్పిస్తామన్నాడు. తొమ్మిది రోజులుగా జరుగుతున్న మ్యాచ్ ఫలితాలతో ఈ లీగ్ చాలా క్లిష్టతరమైందని పేర్కొన్నాడు. దారుణమైన పొరపాట్లు చేసిన వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించనున్నట్లు మాట్టరాజీ తెలిపాడు. పుణె జట్టు, దాని కోచ్ హబాస్ గట్టివాళ్లు, గత రెండేళ్లలో హబాస్ తానేమిటో నిరూపించుకున్నాడని చెప్పాడు.
దీనికి తోడు సొంతగడ్డపై ఆడటం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదన్నాడు. అయినప్పటికీ తమ జట్టు మంచి గేమ్ ఆడుతుందన్నాడు. భారత్ నుంచి టీం తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బెస్ట్ ప్లేయర్ జెజె లాల్పెఖులౌ పైనే మాట్టరాజీ గురి. గత ఏడాది సీజన్‌లో ఆరు గోల్స్, మూడు అసిస్ట్‌లు అందించిన జెజే.. ఈ సీజన్‌లో బోణీ చేయలేదు.
పుణెపై జరిగిన మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ చేసిన జెజెపైనే మాట్టరాజీ ఎక్కువగా నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. చెన్నైయిన్ పాయింట్ల పట్టికలో టాప్‌లోకెళ్లిపోతుంది. పుణె గెలిస్తే నాలుగు పాయింట్లతో గత చేతు అనుభవాలను మర్చిపోయే వీలుంది.