
హైదరాబాద్: పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానొ రొనాల్డోని ఇటీవలే ఇటలీకి చెందిన జువెంటస్ క్లబ్ పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రొనాల్డో రాకతో ఇప్పటివరకూ జువెంటస్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అర్జెంటీనా స్టార్ గొంజాలో హిగ్వెయిన్‌ను క్లబ్ యాజమాన్యం మరో క్లబ్‌కు బదిలీ చేసింది.
రొనాల్డో, హిగ్వెయిన్ ఇద్దరూ ఫార్వర్డ్ పొజిషన్లలో ఆడతారు. ప్రపంచంలొనే అత్యుత్తమ స్ట్రైకర్‌గా వెలుగొందుతున్న క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు జువెంటస్ జట్టులోకి రావడంతో ఆ జట్టు యాజమాన్యం ఆ స్థానంలో ఇప్పటివరకు ఆడిన
హిగ్వెయిన్‌ను మరో క్లబ్‌కు పంపడం సాకర్ అభిమానులను ఏమంత ఆశ్చర్యానికి గురి చేయలేదు.
ఇటాలియన్ లీగ్‌లో పటిష్టమైన క్లబ్‌గా పేరున్న ఏసి మిలాన్ జట్టుకు లోన్ మీద హిగ్వెయిన్‌ను బదిలీ చేసింది. హిగ్వెయిన్‌కు బదులుగా ఏసి మిలాన్ క్లబ్ నుంచి లోన్ మీదే ఇటాలియన్ డిఫెండర్ లియోనార్డో బొనుచ్చిని జవెంటస్ క్లబ్‌లో బదిలీ చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం జువెంటస్ క్లబ్ అధికారికంగా ప్రకటించలేదు. రెండు సీజన్లలో తమ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన హిగ్వెయిన్‌కు యువెంటస్ క్లబ్ వీడ్కోలు పలికింది. 30 ఏళ్ల గొంజాలో హిగ్వెయిన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్లబ్ సాకర్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
హిగ్వెయిన్ ప్రాతినిధ్యం వహించబోతోన్న ఏసి మిలాన్ క్లబ్ ఆరో జట్టు కావడం విశేషం. ప్రస్తుతానికి హిగ్వెయిన్‌ను లోన్ మీదే మిలాన్ క్లబ్‌కు పంపిన జువెంటస్ క్లబ్ సీజన్ ముగిసిన తర్వాత తిరిగి సొంత జట్టులోకి తీసుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేం.