పోర్ట్‌ఎలిజబెత్: ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో జర్మనీ మూడో స్థానం దక్కించుకుంది. శనివారం రాత్రి నెల్సన్ మండేలా బే స్టేడియంలో హోరాహోరీగా సాగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఆ జట్టు 3-2తో ఉరుగ్వేపై విజయం సాధించింది. ముల్లర్ 19వ నిమిషంలో గోల్ కొట్టి జర్మనీ ఖాతా తెరిచాడు. ఐతే 28వ నిమిషంలో సురెజ్ పాస్‌ను అందుకున్న కవాని (ఉరుగ్వే) అద్భుతమైన గోల్‌తో స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి.
51వ నిమిషంలో రాయిస్ పాస్‌ను గోల్‌పోస్టులోకి పంపిన ఫోర్లాన్ ఉరుగ్వేను ఆధిక్యంలో నిలిపాడు. మరో ఐదు నిమిషాలకే జాన్సెన్ (జర్మనీ) గోల్ కొట్టడంతో స్కోరు మళ్లీ సమమైంది. తర్వాత చాలాసేపు గోల్ నమోదు కాలేదు. మ్యాచ్ అదనపు సమయానికి దారితీస్తుందని అనుకుంటుండగా 82వ నిమిషంలో ఖేదిరా గోల్ సాధించి జర్మనీకి విజయాన్నందించాడు. ముల్లర్, ఫోర్లాన్ చెరో ఐదు గోల్స్‌తో మళ్లీ గోల్డెన్ బూట్ రేసులో నిలిచారు. గత ప్రపంచకప్‌లోనూ జర్మనీ మూడో స్థానంలోనే నిలవడం విశేషం