బ్లోమ్ ఫోంటీన్: ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించింది. 4-1 గోల్స్ తేడాతో నెగ్గి సగర్వంగా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరింది. మిరోస్లావ్ క్లోజ్ (20వ నిమిషంలో), లుకాస్ పొడోల్‌స్కీ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా...థామస్ ముల్లర్ (67, 70వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జర్మనీ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు మ్యాట్ అప్సన్ (37వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.
అర్జెంటీనా, మెక్సికో జట్ల మధ్య జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో జర్మనీ క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది. వేన్ రూనీ, ఫ్రాంక్ లాంపార్డ్, స్టీవెన్ జెరార్డ్, జాన్ టెర్రీ, యాష్లే కోల్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ తొలి అర్ధభాగం వరకు తీవ్రంగా పోరాడినా...రెండో అర్ధభాగంలో చేతులెత్తేసింది. ఇంగ్లండ్ రక్షణపంక్తి లోపాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న జర్మనీ ఆటగాళ్లు సూపర్ ఫినిషింగ్‌తో నాలుగు గోల్స్ చేశారు.
ఇంగ్లండ్‌ను ఆదుకుంటాడనుకున్న స్టార్ ప్లేయర్ వేన్ రూనీ ఘోరంగా విఫలమయ్యాడు. టోర్నమెంట్‌లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. ఫలితంగా ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ తొలిసారి మూడు గోల్స్ తేడాతో ఓడింది. ఇంతకుముందు ఇంగ్లండ్ 1954లో ఉరుగ్వే చేతిలో 2-4తో.. 1962లో బ్రెజిల్ చేతిలో 1-3తో పరాజయం పాలైంది.
తొలి అర్ధభాగంలో 40వ నిమిషంలో రిఫరీ చేసిన తప్పిదం ఇంగ్లండ్ పాలిట శాపంగా నిలిచింది. అప్పటికి ఇంగ్లండ్ 1-2తో వెనుకబడింది. పెనాల్టీ ఏరియా అంచుల నుంచి ఫ్రాంక్ లాంపార్డ్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగులుతో నెట్‌లోనికి వెళ్లి బయటకు వచ్చింది. వాస్తవానికి దీనిని గోల్‌గా పరిగణించాలి. కానీ రిఫరీ జార్జి లారియోండా గోల్ ఇవ్వలేదు. ఒకవేళ రిఫరీ గోల్ ఇచ్చిఉంటే ఇంగ్లండ్ స్కోరు 2-2తో సమం చేసేది. కానీ రిఫరీ తప్పిదంతో ఇంగ్లండ్ ఖాతాలో గోల్ చేరలేదు. ఈ సంఘటనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. విరామ సమయానికి జర్మనీ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో జర్మనీ మ్యాచ్‌పై పట్టుబిగించింది. మూడు నిమిషాల తేడాలో ముల్లర్ రెండు గోల్స్ చేయడంతో జర్మనీ ఆధిక్యం 4-1కి చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ తేరుకోలేకపోయింది.
'లాంపార్డ్ కొట్టిన షాట్‌ను రిఫరీ గోల్‌గా ఇచ్చిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మా ఆటగాళ్లు చేసిన తప్పిదాలతో నిరాశ చెందాను. జర్మనీ ఎదురుదాడులు అద్భుతంగా ఉన్నాయి. మేము కొన్ని పొరపాట్లు చేశాం. అయితే రిఫరీ అందరికంటే పెద్ద పొరపాటు చేశాడు' అని ఇంగ్లండ్ కోచ్ ఫాబియో కెపెల్లో, వాపోయారు.