ఒకప్పుడు సాదాసీదా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ యువతి.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా మోడల్స్‌లో ఒకరిగా ఎదిగారు. ఆమె మరెవరో కాదు.. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రియురాలు జార్జినా రోడ్రిగ్జ్. కేవలం 31 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం గ్లామర్, స్టార్‌డమ్, అంతులేని ప్రేమతో నిండిపోయింది.
సామాన్యురాలి నుంచి సెలబ్రిటీ వరకు..
జార్జినా ప్రయాణం ఓ అందమైన కలలా అనిపిస్తుంది. ఓ సాధారణ స్టోర్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె జీవితం రొనాల్డోతో పరిచయం తర్వాత పూర్తిగా మారిపోయింది. వీరిద్దరి బంధం కేవలం ప్రేమకే పరిమితం కాకుండా ఐదుగురు పిల్లల బాధ్యతలతో ఓ బలమైన కుటుంబంగా మారింది. గత పదేళ్లుగా రొనాల్డోకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఆమె సంపాదించుకున్నారు.

డిజిటల్ ప్రపంచంలో రారాణి
జార్జినా రోడ్రిగ్జ్ కేవలం రొనాల్డో భాగస్వామిగానే కాకుండా సోషల్ మీడియాలో ఓ పవర్ హౌస్‌గా అవతరించారు. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో ఆమెకు 92.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా మోడల్స్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచారు. మోడలింగ్ మాత్రమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌లో ఆమె జీవితం ఆధారంగా వచ్చిన సిరీస్ ఆమెను గ్లోబల్ స్టార్‌ను చేసింది.
ఆ ఉంగరం.. 10 ఏళ్ల నిరీక్షణ!
గత ఏడాది ఆగస్టులో క్రిస్టియానో రొనాల్డో ఆమెకు అందించిన నిశ్చితార్థపు ఉంగరం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు £3.7 మిలియన్లు (అంటే దాదాపు రూ. 39 కోట్లు). "ఆ ఉంగరాన్ని చూసి నేను షాక్ అయ్యాను. దాని మెరుపును చూసి కళ్లు కూడా తెరవలేకపోయాను. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతిలో దాని అందాన్ని నిదానంగా ఆస్వాదించాను," అని జార్జినా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదని, పదేళ్ల నిరీక్షణకు దక్కిన ప్రేమ కానుక అని ఆమె పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ మైదానంలోని గ్లామర్, సోషల్ మీడియా లైక్స్ వెనుక జార్జినా ప్రపంచం మొత్తం తన కుటుంబం, ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. తన కలలను నిజం చేసుకుంటూనే, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జార్జినా కథ నేటి తరం మహిళలకు ఒక స్ఫూర్తి.