
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ 2018 హాట్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఫ్రాన్స్ ట్రోఫీ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. సెమిస్‌లో తొలి బెర్త్‌ను ఫ్రెంచి జట్టు ఖరారు చేసుకుంది. క్వార్టర్స్‌లో మాజీ ఛాంపియన్ ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో గెలిచి సెమీస్‌కు చేరుకుంది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు పోటాపోటీగా పోరాడినా.. చివరికి విజయం మాత్రం ఫ్రాన్స్‌నే వరించింది. తొలి అర్ధభాగంలో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో మ్యాచ్ 40వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు వరానే.. హెడర్‌గోల్‌తో తన జట్టుకు తొలి గోల్ అందించాడు. తర్వాత మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తొలి అర్ధభాగంలో 1-0తో ఫ్రాన్స్ ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలోనూ ఇరు జట్లూ సమానంగా బంతిని నియంత్రణలో పెట్టుకొని గోల్ కోసం ప్రయత్నించాయి. ఈ క్రమంలో 61వ నిమిషంలో గ్రీజ్‌మన్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు.
రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఉరుగ్వేను క్వార్టర్స్‌లో ఓడించి సెమిస్‌లో అడుగు పెట్టింది ఫ్రాన్స్. తద్వారా ఆరోసారి ప్రపంచకప్ సెమిస్‌లో అడుగుపెట్టింది ఈ జట్టు. 2006 తర్వాత ఫ్రాన్స్ సెమిస్‌లోకి ప్రవేశించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. 1998లో చివరి సారి ఫ్రెంచి జట్టు సాకర్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఇరవై యేళ్ల తర్వాత ఈ జట్టు ఇప్పుడు ట్రోఫీకి మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది.
ఎటాకింగ్ గేమ్‌తో మరో గోల్ కోసం ఫ్రాన్స్ పోరాడినా ఫలితం లేకపోవడంతో 2-0తో గెలిచి ఫ్రాన్స్ సెమీస్‌కు చేరుకుంది. బలమైన డిఫెన్స్ ఉన్న ఉరుగ్వే.. ఫ్రాన్స్ ఎటాకింగ్ గేమ్‌ను నిలువరించలేక నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బ్రెజిల్, బెల్జియంల మధ్యన మంగళవారం జరిగే మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజేతతో ఫ్రాన్స్ సెమిస్‌లో తలపడనుంది.