హైదరాబాద్: ఇంగ్లండ్ సాకర్ ప్లేయర్ వేన్ రూనీని గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తాగి కారు నడిపించాడనే ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. వివరాల్లోకి వెళితే.... చెషైర్‌లోని బబుల్ రూమ్ బార్‌లో గురువారం రాత్రి మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ సహచరుడు ఫిల్ బార్డ్‌లే తో పార్టీ చేసుకున్నాడు.
పార్టీ అనంతరం తిరిగి వస్తున్న సమయంలో చెషైర్‌లోని తన ఇంటి దగ్గర పోలీసులు అతని కారు ఆపారు. అప్పటికే అతను తాగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. గత వారమే రూనీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ తరఫున 119 మ్యాచ్‌లాడిన రూనీ.. 53 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.