దర్బన్: నైజీరియా, ఉత్తర కొరియాల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారం దక్షిణాఫ్రికాలోని ఫిఫా స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ పోలీసు ఆఫీసర్ కూడా ఉన్నాడు. రద్దీలో పలువురు అభిమానులు కింద పడిపోయారు. వారిలో ఎక్కువ మంది నైజీరియా జెర్సీస్ ధరించినవారు. జోహన్నెస్ బర్గ్ శివారులోని మఖులాంగ్ స్టేడియం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రపంచ కప్ మ్యాచులు ప్రారంభం కావడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. పోలీసు ఆఫీసర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసు అధికార ప్రతినిధి లెఫ్టినెంటే కల్నల్ యూజెన్ ఓప్పర్ మాన్ చెప్పారు. స్టేడియంలోకి రావడానికి, టికెట్లు ఉచితంగా పొందడానికి జనం ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ఒప్పర్ మాన్ చెప్పారు. టికెటింగ్ సంఘటనకు సంబంధం లేదని సాకర్ ఇంటర్నేషనల్ పాలక మండలి స్పష్టం చేసింది.