కేప్ టౌన్: ప్రపంచకప్ లో నెదర్లాండ్స్ దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో 3-2 గోల్స్‌తో ఉరుగ్వేపై గెలిచింది. విరామానికి 1-1తో ఉరుగ్వేతో సమంగా నిలిచిన నెదర్లాండ్స్..ద్వితీయార్ధంలో రెచ్చిపోయింది. బ్రాంకోస్ట్ (18వ నిమిషం), స్నైడర్ (70), రాబెన్ (73) నెదర్లాండ్స్ కు గోల్స్ అందించారు. ఉరుగ్వే తరఫున ఫోర్లాన్ (41), పెరీరా (90+2) గోల్స్ కొట్టారు. ప్రపంచకప్ ఫైనల్ కు చేరడం నెదర్లాండ్స్‌కు ఇది మూడోసారి. 1974, 1978 ఫైనళ్లలో ఓడిపోయింది.
ఆరంభంలో బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న నెదర్లాండ్స్ క్రమంగా ప్రమాదకర దాడులు చేసింది. నిజానికి ఆ జట్టు నాలుగో నిమిషంలోనే ఆధిక్యం సంపాదించేది. కానీ చక్కని అవకాశాన్ని వృథా చేసుకుంది. 14 గజాల దూరం నుంచి డిర్క్ క్యుట్ షాట్ కొట్టగా..బంతి క్రాస్‌బార్ పై నుంచి వెళ్లింది. ఆ తర్వాత దాడులను కొనసాగించిన నెదర్లాండ్స్ కు 18వ నిమిషంలో ఫలితం దక్కింది. బ్రాంకోస్ట్ టోర్నీలోనే అత్యుత్తమ గోల్ కొట్టాడు. ఎడమవైపు 30 గజాల దూరం నుంచి బంతిని అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి తన్నాడు. ఐతే ప్రథమార్ధం ఆఖర్లో ఫోర్లాన్ గోల్‌తో ఉరుగ్వే స్కోరు సమం చేసింది. ద్వితీయార్ధం ఆరంభంలో కూడా ఉరుగ్వే గట్టి పోటీనిచ్చింది. కానీ నెదర్లాండ్స్ పదే పదే దాడులు చేయడంతో తలవంచింది. డచ్ జట్టు 4 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి 3-1 ఆధిక్యాన్ని సంపాదించింది. 70వ నిమిషంలో స్నైడర్, 73వ నిమిషంలో రాబెన్ ఉరుగ్వే గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించారు. తర్వాత గోల్స్ కోసం ఉరుగ్వే తీవ్రంగా ప్రయత్నించింది. ఆఖర్లో పెరీరా గోల్‌తో ఉరుగ్వే.. డచ్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించగలిగింది. ఉరుగ్వే నిష్క్రమణతో ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికా కథ ముగిసింది.