FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌కు సమ్మె సెగ!
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉన్న వేళ టోర్నీలో అత్యంత కీలకమైన వేదికలలో ఒకటైన సోఫై స్టేడియం చుట్టూ తీవ్ర వివాదం నెలకొంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక స్టేడియం కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వేదికపైనే అమెరికా, పరాగ్వే జట్ల మధ్య జరగబోయే ప్రారంభ మ్యాచ్‌తో సహా పలు కీలక మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కార్మికుల సమ్మె నిర్ణయం వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణపై పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉందని క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
స్టేడియంలో సేవలందించే బార్టెండర్లు, వంటమనుషులు, సర్వర్లు, డిష్‌వాషర్లతో కూడిన సుమారు 2,000 మంది హాస్పిటాలిటీ కార్మికులు ఈ సమ్మెకు మద్దతుగా ఓటు వేశారు. స్టేడియం హాస్పిటాలిటీ సేవల భాగస్వామి అయిన 'లెజెండ్స్ గ్లోబల్' సంస్థతో జరిగిన ఒప్పంద చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం వేతనాల పెంపు మాత్రమే కాకుండా పెరిగిన జీవన వ్యయం, ఉద్యోగ భద్రత వంటి ప్రధాన డిమాండ్లతో కార్మికులు యూనియన్ నేతృత్వంలో పోరాటానికి దిగారు. జూన్ 13లోగా యాజమాన్యం దిగిరాకపోతే విధులను బహిష్కరించేందుకు కార్మికులకు పూర్తి అధికారాలు లభించాయి.

ఈ కార్మిక వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న వలస చట్టాల అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 'యునైట్ హియర్ లోకల్ 11' యూనియన్ కో-ప్రెసిడెంట్ కర్ట్ పీటర్సన్ మాట్లాడుతూ.. "కార్మికులు కనీసం ఇళ్ల అద్దెలు కూడా కట్టలేనప్పుడు, విధులకు హాజరవడం లేదా ఐస్ (ICE - Immigration and Customs Enforcement) అధికారుల చేతిలో నిర్బంధానికి గురవడం వంటి భయాల మధ్య బతుకుతున్నప్పుడు లాస్ ఏంజెల్స్‌కు ఈ వరల్డ్ కప్ వల్ల ఉపయోగం ఏంటి?" అని ప్రశ్నించారు. ఒకవేళ తాము సమ్మెకు దిగితే, వరల్డ్ కప్‌లోని రూ. లక్షల విలువైన వీఐపీ సూట్లలో కేవలం వాటర్ బాటిళ్లు, డొరిటోస్ చిప్స్ మాత్రమే మిగులుతాయని ఆయన హెచ్చరించారు.
వలసదారులైన కార్మికులను టార్గెట్ చేస్తూ స్టేడియం పరిసరాల్లో ఎలాంటి దాడులు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని, అలాగే సబ్‌కాంట్రాక్టింగ్ పద్ధతిని నిలిపివేయాలని యూనియన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా స్పందిస్తూ.. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కేవలం టోర్నమెంట్ భద్రతకు మాత్రమే పరిమితమవుతుందని, వలసల తనిఖీలతో దానికి సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ కార్మిక సంఘాలు మాత్రం దీనిని నమ్మడం లేదు. కేవలం లాస్ ఏంజెల్స్ మాత్రమే కాకుండా అట్లాంటా, మయామి వంటి ఇతర ఆతిథ్య నగరాల్లో కూడా వరల్డ్ కప్ సమయంలో వలస చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు వివాదాన్ని పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లెజెండ్స్ గ్లోబల్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. కార్మిక యూనియన్‌తో తమకు సుదీర్ఘ అనుబంధం ఉందని, చర్చల ద్వారా త్వరలోనే ఓ సుహృద్భావ ఒప్పందానికి వస్తామనే నమ్మకం ఉందని పేర్కొంది. అయితే, జూన్ 11 నుంచి జులై 19 వరకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో ఉమ్మడిగా జరగనున్న ఈ చారిత్రాత్మక 48 జట్ల ఫిఫా వరల్డ్ కప్‌కు ఈ సమ్మె ముప్పు ఓ పెద్ద తలనొప్పిగా మారింది. మైదానంలో ఆట ఎంత ముఖ్యమో, మైదానం వెలుపల ఏర్పాట్లు కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ వివాదం మరోసారి గుర్తుచేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications