ఫిఫా వరల్డ్ కప్ షురూ.. బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులతో రచ్చ రచ్చే!
Fifa World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీ అయిన ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం క్రీడాభిమానులతో పాటు సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి టోర్నమెంట్ మూడు దేశాల్లో(అమెరికా, మెక్సికో, కెనడా) జరగనుండటంతో.. మూడు వేర్వేరు నగరాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలను నిర్వహించాలని ఫిఫా నిర్ణయించింది. ఈ వేడుకల్లో అంతర్జాతీయ పాప్ సింగర్ కేటీ పెర్రీతో పాటు బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహీ తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
అమెరికాలో కేటీ పెర్రీ మ్యాజిక్
జూన్ 12న కాలిఫోర్నియాలోని సోఫీ స్టేడియంలో అమెరికా తన తొలి మ్యాచ్‌లో పరాగ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరగబోయే భారీ వేడుకలో ప్రపంచ ప్రఖ్యాత సింగర్ కేటీ పెర్రీ తన స్వరంతో మ్యాజిక్ చేయనున్నారు. ఆమెతో పాటు ర్యాపర్ ఫ్యూచర్, లీసా, టైలా, అనిట్టా, రేమా వంటి గ్లోబల్ స్టార్స్ ఈ వేదికను పంచుకోనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి.

మెక్సికోలో లాటిన్ మ్యూజిక్ జాతర
టోర్నమెంట్ అధికారికంగా జూన్ 11న మెక్సికో సిటీలోని చారిత్రాత్మక ఎజ్టెకా స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ప్రారంభ వేడుకలో లాటిన్ సంగీతానికి పెద్దపీట వేశారు. జే బాల్విన్, అలెజాండ్రో ఫెర్నాండెజ్, డానీ ఓషన్ వంటి ప్రముఖులు ఇక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే దక్షిణాఫ్రికా సింగర్ టైలా తన పాటలతో మెక్సికోలో ఫుట్‌బాల్ సెగ పుట్టించనుంది.
కెనడా వేదికపై నోరా ఫతేహీ సందడి
కెనడాలో జరగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌లో టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్ వేదికగా బోస్నియా, హెర్జెగోవినా జట్లు తలపడనున్నాయి. ఈ వేడుకను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు కెనడాకు చెందిన మైఖేల్ బుబ్లే, అలానిస్ మోరిసెట్, అలేసియా కారాలతో పాటు బాలీవుడ్ సెన్సేషన్ నోరా ఫతేహీ తన డ్యాన్స్‌తో దుమ్ములేపనుంది. నోరా ఫతేహీ ప్రదర్శనతో ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ ముద్ర కూడా బలంగా పడనుంది.
90 నిమిషాల నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్
ఈసారి 48 జట్లు పాల్గొంటున్న అతిపెద్ద టోర్నమెంట్ కావడంతో వినోద కార్యక్రమాల స్థాయిని కూడా ఫిఫా భారీగా పెంచింది. మూడు దేశాల్లో జరిగే ప్రారంభ వేడుకలు మ్యాచ్‌లు మొదలవ్వడానికి 90 నిమిషాల ముందే ప్రారంభమవుతాయి. ఆతిథ్య దేశాల సంస్కృతిని, అంతర్జాతీయ సంగీతాన్ని మేళవించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఫిఫా ఈ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా కేటీ పెర్రీ హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications