Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమ్ ఘోర పరాజయం.. కోచింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ కోచ్!

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026లో నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లో మొరాకో చేతిలో నెదర్లాండ్స్ జట్టు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఘోర ఓటమి తర్వాత నెదర్లాండ్స్ జట్టు హెడ్ కోచ్ రోనాల్డ్ కోమన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ప్రపంచ కప్‌లో డచ్ జట్టు ప్రయాణం ముగియడమే కాకుండా మేనేజర్‌గా నెదర్లాండ్స్ జట్టుతో కోమన్‌కు ఉన్న రెండో విడత ఒప్పందం కూడా ముగిసిపోయింది.

రోనాల్డ్ కోమన్ గతంలో 2018 ప్రారంభం నుంచి 2020 మధ్య కాలం వరకు నెదర్లాండ్స్ జట్టుకు మొదటిసారి కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఖతార్ వేదికగా జరిగిన ప్రపంచకప్ అనంతరం(ఇందులో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ చేరింది) ఆయన 2023 ప్రారంభంలో మళ్లీ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.."డచ్ జాతీయ జట్టు కోచ్‌గా నా పదవీ కాలాన్ని ముగించాలని నేను నిర్ణయించుకున్నాను. మేమంతా ఈ ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించాలని కలలు కన్నాం. కానీ విజయం సాధించలేకపోయాం. ఈ విషయంలో నాకంటే ఎక్కువ నిరాశ చెందిన వారు ఎవరూ ఉండరు. జాతీయ కోచ్‌గా ఆ ఓటమి బాధ్యత నాదే" అని రోనాల్డ్ కోమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

FIFA World Cup 2026 Netherlands coach Ronald Koeman resigns after shock defeat to Morocco

రోనాల్డ్ కోమన్ కోచింగ్‌లో డచ్ జాతీయ జట్టు మూడు పెద్ద టోర్నీలకు(యూరో 2021, యూరో 2024, 2026 వరల్డ్ కప్) క్వాలిఫై అయ్యింది. ముఖ్యంగా యూరో 2024లో డచ్ జట్టు సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. అలాగే తన మొదటి విడత కోచింగ్ కాలంలో, 2019లో నెదర్లాండ్స్‌ను యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ ఫైనల్‌కు కూడా చేర్చారు. మొత్తంగా ఆయన 64 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో డచ్ జట్టుకు కోచ్‌గా సేవలు అందించారు. కాగా రోనాల్డ్ కోమన్ తన కాంట్రాక్ట్‌ను ఇకపై పొడిగించబోవడం లేదని రాయల్ డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ కూడా అధికారికంగా ధ్రువీకరించింది.

ఫిఫా ప్రపంచ కప్‌లో తమ ప్రయాణం ఇంత త్వరగా ముగిసిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని రోనాల్డో కోమన్ పేర్కొన్నారు. అయితే గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు తామంతా కలిసి గడిపిన అద్భుతమైన క్షణాలు, అభిమానుల మద్దతు మాత్రమే గుర్తుంటాయని.. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇకపై తన భార్య, పిల్లలు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నానని, అందుకే ఈ సహజమైన నిర్ణయం తీసుకున్నానని రోనాల్డ్ కోమన్ తన సందేశంలో ముగించారు.

Story first published: Wednesday, July 1, 2026, 13:50 [IST]
Other articles published on Jul 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+