FIFA WC 2026: చివరి నిమిషంలో ట్విస్ట్.. ఐవరీకోస్ట్‌పై జర్మనీ ఉత్కంఠభరిత విజయం!
FIFA WC 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లో జర్మనీ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. టొరంటో వేదికగా ఐవరీకోస్ట్‌తో జరిగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో జర్మనీ 2-1 తేడాతో విజయం సాధించి టోర్నీలో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. సబ్‌స్టిట్యూట్‌గా స్టేడియంలోకి వచ్చిన డెనిజ్ ఉండావ్ రెండు అద్భుతమైన గోల్స్ చేసి జర్మనీని గెలిపించి రియల్ హీరోగా నిలిచాడు. జర్మనీ కోచ్ జూలియన్ నాగెల్స్‌మన్ సెకండాఫ్‌లో చేసిన వ్యూహాత్మక మార్పులు ఈ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి.
మ్యాచ్ ప్రారంభంలో 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జర్మనీ పటిష్టమైన ఆటతీరును ప్రదర్శించింది. అయితే 29వ నిమిషంలో ఐవరీకోస్ట్ అనూహ్యంగా తొలి గోల్ చేసి జర్మనీకి షాకిచ్చింది. ఆ జట్టు ఆటగాడు ఫ్రాంక్ కేసీ లభించిన రీబౌండ్ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో ఐవరీకోస్ట్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జర్మనీ జట్టు ఫస్ట్ హాఫ్‌లో గోల్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఐవరీ కోస్ట్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. దీంతో సగం ఆట ముగిసేసరికి ఐవరీ కోస్ట్ ఆధిక్యంలో నిలిచింది.

సెకండాఫ్‌లో జర్మనీ కోచ్ నాగెల్స్‌మన్ 60వ నిమిషంలో డెనిజ్ ఉండావ్, నాడీమ్ అమిరిలను సబ్‌స్టిట్యూట్‌లుగా మైదానంలోకి దించి మాస్టర్ స్ట్రోక్ ఆడారు. ఈ మార్పు జర్మనీ ఆటలో కొత్త వేగాన్ని తెచ్చింది. 68వ నిమిషంలో అమిరి అందించిన అద్భుతమైన క్రాస్‌ను ఉండావ్ గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అత్యధిక ఇంపాక్ట్ చూపిన రెండో ఆటగాడిగా ఉండావ్ ఈ గోల్‌తో రికార్డు సృష్టించాడు.
మ్యాచ్ డ్రా వైపు సాగుతున్న తరుణంలో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఐవరీకోస్ట్ ఆటగాడు అడింగ్రాకు 88వ నిమిషంలో గోల్ చేసే సువర్ణావకాశం లభించినప్పటికీ.. అతను దానిని చేజార్చుకున్నాడు. ఇక ఇంజురీ సమయంలో (90+4వ నిమిషంలో) ఎన్‌మెచా అందించిన త్రూ-బాల్‌ను అద్భుతమైన నియంత్రణతో అందుకున్న డెనిజ్ ఉండావ్.. ఐవరీకోస్ట్ గోల్ కీపర్‌ను పక్కదారి పట్టిస్తూ జర్మనీకి విజయభేరి మోగించిన రెండో గోల్ అందించాడు.
ఈ అద్భుత విజయంతో జర్మనీ గత రెండు ప్రపంచకప్‌ల నాకౌట్ గండం నుంచి బయటపడింది. గత రెండు ఎడిషన్లలో గ్రూప్ స్టేజ్ దాటలేకపోయిన జర్మనీ, ఈసారి ఈ గెలుపుతో నాకౌట్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జర్మనీ తరఫున ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో అదరగొడుతున్న ఉండావ్.. ఈక్వెడార్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌లో స్థానం కోసం సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు ఐవరీ కోస్ట్ తదుపరి రౌండ్ చేరాలంటే కురాకోపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications