ఫిఫా వరల్డ్ కప్ వేళ ఫ్యాన్స్‌కు షాక్.. స్టేడియాల్లోకి వాటిపై నిషేధం!
ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే క్రీడాభిమానులకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) ఊహించని షాక్ ఇచ్చింది. 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులు ఇకపై రీ-యూజబుల్ వాటర్ బాటిళ్లను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది. టోర్నమెంట్ ఆరంభానికి ముందే, ఫిఫా తన నియమావళిని సవరిస్తూ మంగళవారం నుంచి ఈ నూతన నిబంధనని అమలు చేస్తోంది. జూన్ 11-జులై 19 వరకు అమెరికా, కెనడా, మెక్సికోలు ఈ వరల్డ్ కప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.
గతంలో ఖాళీ, పారదర్శక ప్లాస్టిక్ రీ-యూజబుల్ బాటిళ్లు అనుమతించబడేవి. కానీ, సవరించిన నిబంధనలతో ఇప్పుడు వాటిని పూర్తిగా నిషేధించారు. క్రీడాకారులు, రెఫరీలు, ప్రేక్షకులు, వాలంటీర్లు, సిబ్బంది భద్రతే తమ అత్యంత ప్రాధాన్యమని ఫిఫా వెల్లడించింది. బాటిళ్లను విసిరివేయడం లేదా ఇతర ప్రమాదాలు సృష్టించే అవకాశం ఉండటంతో భద్రతా బెదిరింపులను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మ్యాచ్‌లు జరిగే అనేక స్టేడియాల్లో బాటిళ్లపై ఇప్పటికే నిషేధం ఉందని ఫిఫా పేర్కొంది. టోర్నమెంట్ అంతటా ఒకే విధమైన భద్రతా ప్రమాణాలను అమలు చేసేందుకు ఈ నిబంధన అన్ని వరల్డ్ కప్ వేదికలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో అభిమానుల్లో వేడి, త్రాగునీటి లభ్యతపై ఆందోళనలు పెరిగాయి. టోర్నమెంట్ సమయంలో కొన్ని ఆతిథ్య నగరాల్లో 26-28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా.
ఈ ఆందోళనలపై ఫిఫా స్పందిస్తూ, ప్రేక్షకులకు సమగ్ర ఉష్ణ నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపింది. వేడి ప్రభావం తగ్గించేందుకు స్టేడియం చుట్టూ మిస్టింగ్ స్టేషన్లు, పెద్ద ఫ్యాన్లు, హైడ్రేషన్ స్టేషన్లు, కూలింగ్ టెంట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చింది. స్టేడియం లోపల నీటి ధరలు ఇతర ఈవెంట్‌లతో సమానంగా ఉంటాయని, వరల్డ్ కప్ కోసం పెంచబడవని ఫిఫా స్పష్టం చేసింది.
అమెరికా, కెనడా, మెక్సికోల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 11 నుంచి జూలై 19 వరకు 2026 ఫిఫా వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 48 జట్లు పాల్గొంటాయి. మ్యాచ్‌ల సంఖ్య కూడా 64 నుంచి 104కి పెరుగుతుంది. మొదటిసారిగా అదనపు నాకౌట్ రౌండ్ కూడా ఆడబడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications