
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్ 2018లో పసికూన ఉరుగ్వే సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. దూకుడు మీదున్న ఆతిథ్య రష్యా జట్టుకు ఉరుగ్వే షాక్ ఇచ్చింది. 2018 ఫిఫా వరల్డ్ కప్‌లో తొలిసారి రష్యా పరాజయం పాలైంది. ఆట మొదటి నుంచి ఉరుగ్వే ఆటగాళ్లు రష్యాపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. సోమవారం రాత్రి ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే 3-0 తేడాతో ఆ జట్టుని మట్టికరిపించింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఏ దశలోనూ రష్యాకి అవకాశమివ్వని ఈ పసికూన.. తాజా విజయంతో గ్రూప్-ఎలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుని నాకౌట్ ముందు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంది. ఆట మొదలైన 10వ నిమిషంలోనే ఉరుగ్వే స్ట్రైకర్ లూయీస్ సురేజ్ తొలిగోల్ చేశాడు. ఫ్రీకిక్‌ను అద్భుతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌తో ఉరుగ్వే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఉరుగ్వేను అడ్డుకోవాలన్న కంగారులో రష్యా మిడ్ ఫీల్డర్ డానిస్ చెర్సోవ్ 23వ నిమిషంలో సెల్ఫ్‌గోల్ చేశాడు. దీంతో ఉరుగ్వేకు 2-0 ఆధిక్యం లభించింది.
ఇక ఆట చివరి వరకు రష్యా గోల్ పోస్టులపై ఉరుగ్వే ఆటగాళ్ల దాడులు కొనసాగాయి. ఈ మ్యాచ్‌లో 15సార్లు రష్యా గోల్‌పోస్టులపై ఉరుగ్వే ఆటగాళ్లు దాడులు చేయగా.. రష్యా మాత్రం కేవలం మూడు సార్లు మాత్రమే ఉరుగ్వే గోల్‌పోస్టులపై దాడి చేసింది. 90 నిమిషంలో ఉరుగ్వే స్ట్రైకర్ ఎడ్నసన్ కావానీ గోల్ చేశాడు. దీంతో 3-0తో ఉరుగ్వే తిరుగులేని ఆధిక్యం సాధించింది. 2010, 2014, 2018 ప్రపంచకప్‌లలో గోల్స్ నమోదు చేసిన ఆటగాడిగా కవానీ రికార్డు సాధించాడు.
మరోవైపు టోర్నీలో తొలిసారి ఓటమి రుచి చూసిన రష్యా.. గ్రూప్‌లో ఉరుగ్వే తర్వాత స్థానానికి పరిమితమైంది. ఇక గ్రూప్‌లో మిగిలిన సౌదీ అరేబియా, ఈజిప్ట్ జట్లు ఇంటిబాట పట్టనున్నాయి.