
హైదరాబాద్: ప్రపంచంలోని ఫుట్‌బాల్ ప్లేయర్ల అభిమానులు అందరూ ఒకవైపు.. మెస్సీ అభిమానులు ఒకవైపు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. మ్యాచ్ ప్రాక్టీసు చేస్తున్న స్టేడియం రుజువు చేసింది. ఫిఫా వరల్డ్‌కప్-2018లో గ్రూపు-డిలో కొన్ని గంటల్లో ఆసక్తికర పోరుకు సర్వం సన్నద్ధమవుతోంది. ఒకవైపు రెండు సార్లు ఛాంపియన్ అర్జెంటీనా, మరోవైపు తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న ఐస్‌లాండ్.. ఈ క్రమంలో మ్యాచ్ మరి ఏకపక్షమో, ఆసక్తికరమో చూడాల్సిందే. అయితే ఆట సంగతి ఎలా ఉన్నా అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనాల్ మెస్సిపైనే అందరిదృష్టి.
తాజాగా మెస్సి ప్రాక్టీసు మ్యాచ్‌కు హాజరైతేనే స్టేడియం నిండిపోయిందంటే ప్రపంచకప్‌లో అతనికున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టోర్నీలోనే బలమైన జట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనా, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మాత్రం అతికష్టం మీద నెట్టుకొచ్చింది. మెస్సితోపాటు గొంజాలో హిగెయిన్, అగ్వెరో వంటి స్టార్లతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతున్నా విజయంపై ఇరుజట్లలో సమానమైన పోటీ నెలకొంది.
మరోవైపు సంచలనాల ఐస్‌లాండ్‌ను కూడా తీసిపారేయలేము. ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి పిన్న దేశంగా రికార్డు సృష్టించిన ఐస్‌లాండ్, పేరుకే చిన్న జట్టే అయినా ప్రతిభ, పట్టుదలలో మాత్రం గట్టి జట్టు. నాణ్యమైన ఆటగాళ్లతో సంచలనాల సృష్టించగల సత్తా ఉన్న జట్టు ఇది. ఆరోన్ గునర్సన్, సిగుర్డ్‌సన్ వంటి ఆటగాళ్లతో మెరుగ్గానే కనిపిస్తున్నా.. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఈ జట్టు బలమైన అర్జెంటీనాను ఎదుర్కొనబోతుంది.
రష్యాలోని కాలమానం ప్రకారం.. సోమవారం ప్రాక్టీసుకు వెళ్తున్న అర్జెంటీనా జట్టును చూసి వారు బస చేస్తున్న హోటల్ దగ్గర అభిమానులు హర్షధ్వానాలు మెస్సీ..మెస్సీ అంటూ అరుస్తూ తన అభిమాన ఆటగాడిని పిలిచారు. కాగా, అక్కడి ఉష్ఘోగ్రతలు చాలా తక్కువగా ఉన్నా.. ఎక్కడో కాస్త ఎండ పడుతుండటంతో ప్రాక్టీసు చేసేందుకు వారిని జట్టు యాజమాన్యం అనుమతించింది.