కేప్ టౌన్: ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌లో కూడా ఫలితం తేలలేదు. ఫ్రాన్స్, ఉరుగ్వేల మధ్య మ్యాచ్ (గ్రూప్-ఎ) 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభంలో ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఉరుగ్వే గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. గొవొ చక్కని అవకాశాన్ని వృథా చేయకపోయుంటే ఫ్రాన్స్ ఏడో నిమిషంలోనే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లేది. రిబరీ ఇచ్చిన కచ్చితమైన క్రాస్‌ను గోల్‌గా మలచడంలో గొవొ విఫలమయ్యాడు.
క్రమంగా ఉరుగ్వే కూడా పుంజుకుంది. కానీ ఆట మామూలుగా సాగిపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి స్కోరు 0-0. రెండో అర్ధభాగంలో ఫ్రాన్స్ వేగం పెంచింది. 81 నిమిషంలో ఉరుగ్వే ఆటగాడు నికోలస్ లొడీరో రెడ్ కార్డు (ఈ ప్రపంచకప్‌లో మొదటిది) కు గురై మైదానం నుంచి నిష్క్రమించడంతో ఫ్రాన్స్ దాడులను తీవ్ర తరం చేసింది. అనేకసార్లు గోల్‌కు చేరువైంది. అయినా ఫలితం లేకపోయింది. ఉరుగ్వే పోరాడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.