ఫిఫా వరల్డ్ కప్: నేమార్ మెరవలేదు, స్విట్జర్లాండ్‌తో బ్రెజిల్ మ్యాచ్ డ్రా

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న 21వ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి మెక్సికో షాక్ ఇచ్చిన రోజే.. బ్రెజిల్ జట్టును కూడా స్విట్జర్లాండ్ నిలువరించింది. కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టిపోటీ ఎదురైంది.

ఫలితంగా గ్రూప్-ఇలో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను బ్రెజిల్ 1-1తో డ్రాగా ముగించింది. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ తొలి అర్ధభాగంలో స్థాయికి తగ్గట్టు ఆడినా... రెండో అర్ధభాగంలో పూర్తిగా అభిమానులను నిరాశపరిచింది.
ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 1950 ప్రపంచక్‌పలోనూ వీరి మ్యాచ్ 2-2తో డ్రాగానే ముగిసింది. బ్రెజిల్ తరఫున 20వ నిమిషంలో ఫిలిప్ కౌటినో సూపర్ గోల్ సాధించగా రెండో అర్ధభాగంలో 50వ నిమిషంలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టీవెన్ జుబెర్ హెడర్‌తో స్కోరును సమం చేశాడు.
అయితే నేమార్‌ను అడ్డుకునే ప్రణాళికలను మాత్రం స్విస్ ఆటగాళ్లు అద్భుతంగా అమలు చేశారు. ఏకంగా పదిసార్లు అతడిని ఫౌల్ చేస్తూ కిందపడేయడంతో బాధతో విలవిల్లాడాడు. అటు తనకు లభించిన రెండు ఫ్రీకిక్‌లను కూడా గోల్స్‌గా మలచడంలో నేమార్ విఫలమయ్యాడు.

తమ స్థాయికి తగ్గట్టుగానే
మ్యాచ్ అరంభం నుంచీ బ్రెజిల్ ప్రదర్శన తమ స్థాయికి తగ్గట్టుగానే సాగింది. అయితే ప్రారంభంలో తమకు లభించిన అవకాశాలను బ్రెజిల్ వినియోగించుకోలేకపోయింది. 15వ నిమిషంలో నేమార్‌ను బెహ్రామి ఫౌల్ చేయగా ఫ్రీకిక్ లభించింది. అయితే దీన్ని నేమార్ గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. నేమార్, జీసస్, విలియన్‌లతో బ్రెజిల్ ఎడతెరిపి లేకుండా దాడులు చేసింది.

1-0తో ఆధిక్యంలోకి బ్రెజిల్
ఎట్టకేలకు 20వ నిమిషంలో వారి ప్రయత్నం ఫలించింది. కుటినో కళ్లు చెదిరే కిక్‌తో స్విస్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి బ్రెజిల్ ఖాతా తెరిచాడు. దీంతో జట్టు 1-0తో ఆధిక్యం సాధించింది. 32వ నిమిషంలో మరో ఫ్రీకిక్ లభించినా మార్సెల్ షాట్‌ను స్విస్ డిఫెండర్లు అడ్డుకున్నారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

రెండో అర్ధభాగంలో దూకుడు పెంచిన స్విట్జర్లాండ్
ఇక, రెండో అర్ధభాగంలో స్విట్జర్లాండ్ దూకుడు పెంచింది. బ్రెజిల్ డిఫెన్స్‌ను తప్పుదోవ పట్టిస్తూ ఫలితం రాబట్టింది. 50వ నిమిషంలో లభించిన కార్నర్‌ను జెర్డాన్ షకిరి ‘డి' ఏరియా గోల్‌పోస్ట్ ముందువైపు కొట్టగా ఏడుగురు బ్రెజిల్ డిఫెండర్ల మధ్యలో ఉన్న స్టీవెన్ జుబెర్ అందర్నీ బోల్తా కొట్టించి గాల్లోకి ఎగిరి హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు.

బ్రెజిల్‌ను నిలువరించడానికి ప్రాధాన్యత
స్కోరు సమం చేశాక స్విట్జర్లాండ్ వేగం తగ్గించి బ్రెజిల్‌ను నిలువరించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అటు బ్రెజిల్ కూడా ఆధిక్యం కోసం ఎదురుదాడికి దిగింది. బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్‌ను స్విట్జర్లాండ్ ఆటగాళ్లు టార్గెట్ చేశారు. అతడిని ఏకంగా 10 సార్లు అడ్డుకున్నారు. కౌటినో వరుస రెండు షాట్లను కీపర్ అడ్డుకోగా అటు నేమార్ గోల్‌పోస్ట్ దగ్గరి నుంచి ఆడిన షాట్ పక్కనుంచి వెళ్లింది.

చివర్లో బ్రెజిల్‌కు లభించిన అవకాశం
స్విట్జర్లాండ్ డిఫెండర్లు అప్రమత్తంగా ఉండటంతో 77వ నిమిషం వరకు బ్రెజిల్ ఆటగాళ్లు గోల్ పోస్ట్‌వైపు షాట్‌లు సంధించకపోవడం గమనార్హం. 90వ నిమిషంలో డెనీ ఫిర్మినో హెడర్‌ను స్విస్ గోల్‌కీపర్ విఫలం చేశాడు. చివర్లో బ్రెజిల్‌కు లభించిన అవకాశాలను కూడా బ్రెజిల్ సొమ్ముచేసుకోలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications