భారత పుట్‌బాల్ C/0 మణిపూర్: జట్టులో ఎనిమిది మంది
హైదరాబాద్: పుట్‌బాల్... భారత్‌లో క్రేజ్ తక్కువే. కానీ, ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే గేమ్ ఏదైనా ఉందంటే అది పుట్‌బాల్ మాత్రమే. యూరోపియన్, అమెరికా లాంటి దేశాల్లో సాకర్ అంటే చాలు ఊగిపోతారు. అందుకే ఏ స్థాయిలోనైనా ఫుట్‌బాల్ టోర్నీ అంటే ఆతిథ్యం కోసం దేశాలు ఎగబడుతుంటాయి.
ఇక అది వరల్డ్ కప్ అయితే వేల కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహిస్తుంటాయి. ఇందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా తమ వంతు సహకారం అందిస్తుంది. తాజాగా, సాకర్ క్రేజ్‌ను ఆసియా దేశాల్లోనూ వ్యాపింపచేయాలనే లక్ష్యంతో అండర్-17 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను ఫిఫా భారత్‌కు కట్టబెట్టింది.
అజర్‌బైజాన్, ఐర్లాండ్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలతో పోటీపడి 2013లో ఆతిథ్య హక్కులు దక్కించుకున్న భారత్ ఈ వరల్డ్ కప్ నిర్వహణ కోసం పూర్తిగా సంసిద్ధమైంది. మొత్తం 24 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ఆరు వేదికలను సిద్ధం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, కొచ్చి, గౌహతి, గోవా వేదికల్లో పోటీలు నిర్వహించనున్నారు.
24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో ఉన్న ఆతిథ్య భారత్.. ఈనెల 6న జరిగే ఆరంభ పోరులో పటిష్ట యూఎస్‌ఏ (అమెరికా)తో తలపడనుంది. 52 మ్యాచ్‌లపాటు సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీ అక్టోబర్ 6న మొదలై 28న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 22 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.

మణిపూర్ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్) 21 మందితో జట్టును ప్రకటించింది. వీరిలో వెనుకబడిన ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో కెప్టెన్ అమర్‌జీత్‌సింగ్‌తో సహా గోల్‌కీపర్ ధీరజ్‌సింగ్, జాక్సన్‌సింగ్, నాంగ్‌దామ్‌బా నోరెమ్, సారా జహాన్, బోరిస్‌సింగ్, సురేశ్‌సింగ్, నింగ్‌తోయి గంబా ఉన్నారు.

ఫుట్‌బాల్‌పై ప్రేమతో జాతీయస్థాయికి
పూట గడువని పేద కుటుంబాల నుంచి వచ్చినా వీరంతా ఫుట్‌బాల్‌పై ప్రేమతో జాతీయస్థాయికి ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తల్లిదండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహంతో ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వీరంతా ఇలా వెలుగులోకి రావడానికి కారణం జర్మనీకి చెందిన నికోల్ ఆడమ్సే కారణమని అంటున్నారు వారి తల్లిదండ్రులు.

అండర్-17 సాకర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు
2015లో భారత అండర్-17 సాకర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆడమ్స్ తొలుత దృష్టిపెట్టింది ఈశాన్య రాష్ర్టాలపైనే. దేశం మొత్తం కలియతిరిగినా అతనికి కావాల్సిన ప్లేయర్లు దొరకలేదు. దీంతో ఈశాన్య రాష్ర్టాలపై గురిపెట్టిన ఆడమ్స్‌కు అద్భుతమైన ప్లేయర్లు తారసపడ్డారు. అనుకున్నదే తడవుగా మేఘాలయ, సిక్కిం, మిజోరాం, మణిపూర్ రాష్ర్టాల నుంచి కొంత మంది సాకర్ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాడు.

మణిపూర్ కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చిన ఆడమ్స్
ముఖ్యంగా మణిపూర్ కుర్రాళ్లు తగినంత ఎత్తు, శరీర సౌష్టవంలో మిగతా వాళ్లతో పోలిస్తే మెరుగ్గా కనిపించారు. జాతీయ జట్టులో కచ్చితంగా రాణిస్తారని అనుకున్న ఆడమ్స్ మణిపూర్ కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చాడు. కోచ్ నమ్మకాన్ని నిలబెట్టిన యువకులు మెరికల్లాగా తయారయ్యారు. ఒక్క మణిపూర్ నుంచే జాతీయ జట్టుకు ఇంత మంది ఎంపిక కావడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని అర్జున అవార్డు గ్రహీత, భారత మహిళల మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఒయినమ్ బొంబేమ్ దేవి పేర్కొంది.

భారత ఫుట్‌బాల్‌పై ఈశాన్య రాష్ట్రాల ఆధిపత్యం
భారత ఫుట్‌బాల్‌పై ఈశాన్య రాష్ట్రాల ఆధిపత్యం చూస్తే సంతోషంగా ఉందని వెల్లడించింది. తమదైన రోజునా ఎవరినైనా ఓడించే సత్తా వారి సొంతమని ఆమె పేర్కొంది. ఇక, మణిపూర్ ఎఫ్‌ఏ కార్యదర్శి రంజీత్‌రాయ్ మాట్లాడుతూ 'ఫుట్‌బాల్ ప్రపంచకప్‌తో దేశ భవిష్యత్ మారబోతోంది. సాకర్ పట్ల మరింత ఆసక్తి పెరిగేందుకు ఆస్కారముంది. దేశం యావత్తు మణిపూర్‌లో శిక్షణ పొందేందుకు వచ్చే అవకాశముంది. భారత్ ఫుట్‌బాల్ పవర్‌హౌజ్‌గా మారితే మణిపూర్ అందులో కీలక భూమిక పోషిస్తుంది' అని రాయ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications